మే చివరికి పట్టణ ఆరోగ్యకేంద్రాలు సిద్ధం

20 Apr, 2022 03:56 IST|Sakshi
కర్నూలు జిల్లా కొత్తపేట మంగళగేరేలో వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌

ఇప్పటికే 184 భవనాలు అందుబాటులోకి 

రూ.340 కోట్లతో 344 కొత్త భవనాల నిర్మాణం 

ప్రతి 2 కిలోమీటర్లకు ఒక అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ 

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మిస్తున్న వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్లు (పట్టణ ఆరోగ్యకేంద్రాలు) మే నెల చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా భవనాలు సమకూర్చే పనులు చేపట్టింది.

అధికారులు ఇప్పటికే రూ.18.40 కోట్లతో 184 పాత భవనాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.340 కోట్లతో చేపట్టిన 344 భవానాల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఎనిమిది భవనాల నిర్మాణం పూర్తయింది. 150 భవనాల నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినట్టు పనులు చేపట్టిన పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు తెలిపారు. నేల స్వభావాన్ని బట్టి కొన్నిచోట్ల భవన నిర్మాణానికి అంచనా కన్నా ఎక్కువ వ్యయం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సైతం తొలి ప్రాధాన్యంగా పట్టణ ఆరోగ్యకేంద్రాలపై ఆరా తీశారు. 

మరిన్ని వార్తలు