ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

5 Oct, 2020 04:27 IST|Sakshi

అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన సీఎం కార్యాలయం

బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వైద్య పరికరాలతో ఎక్మో ట్రీట్మెంట్‌

అయినా పరిస్థితి విషమించి మృత్యువాత

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) ఆదివారం కన్నుమూశారు. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. గత నెలవరకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా పనిచేశారు. నిష్కళంక నాయకుడిగా, అవినీతి మరకలేని నేతగా పేరు సంపాదించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్‌కు ఆగస్టు 29న కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో నాలుగు రోజులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. తరువాత నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్సతో కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు.

కలెక్టర్‌తో మాట్లాడి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వైద్య పరికరాల ద్వారా ఎక్మో ట్రీట్మెంట్‌ అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1961 ఫిబ్రవరి 1న జన్మించిన ఆయనకు భార్య శశి, కుమారుడు శ్రీవాత్సవ్, కుమార్తె శ్వేత ఉన్నారు. తన తండ్రి అంత్యక్రియల్ని సోమవారం నిర్వహించనున్నట్లు శ్రీనివాస్‌ కుమారుడు శ్రీవాత్సవ్‌ చెప్పారు. తన తండ్రి అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని పెదవాల్తేరు డాక్టర్స్‌ కాలనీలోని తమ నివాసంలో ఉంచుతామని, మధ్యాహ్నం కాన్వెంట్‌ జంక్షన్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్‌గా..
తిరుగులేని నాయకుడిగా పేరొందిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్‌ 1980 నుంచి యువనేతగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. 1994 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ద్రోణంరాజు సత్యనారాయణ ఆకస్మిక మరణంతో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 2009లో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో ప్రభుత్వ విప్‌గా, టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, విశాఖ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఓటమి చెందిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవించారు. వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్‌గా పనిచేసిన ఆయన పదవీకాలం నెలకిందట పూర్తయింది. తండ్రికి తగ్గ తనయుడిగా, నిస్వార్థ రాజకీయాలకు మారుపేరుగా ప్రజల మన్ననలు పొందారు. 

జగన్‌ రాజకీయ పునర్జన్మనిచ్చారు...
ఓ దశలో ద్రోణంరాజు కుటుంబ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తంగేడు రాజుల నుంచి విశాఖ రాజకీయాల్ని తన చతురతతో చేజిక్కించుకున్న ద్రోణంరాజు సత్యనారాయణ తిరుగులేని నేతగా మారారు. దశాబ్ద కాలంగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓటమి పాలైన ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌ దక్షిణ నియోజకవర్గ టికెట్‌ కేటాయించి ప్రాధాన్యతనిచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన శ్రీనివాస్‌కు ధైర్యం చెప్పి.. వీఎంఆర్‌డీఏ పదవిని కట్టబెట్టారు. ‘‘ద్రోణంరాజు కుటుంబం రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ మళ్లీ రాజకీయ పునర్జన్మనిచ్చారు’’ అంటూ ద్రోణంరాజు శ్రీనివాస్‌ పలుమార్లు భావోగ్వేదంతో వ్యాఖ్యానించేవారు.  

మరిన్ని వార్తలు