శ్రీశైలం, సాగర్‌లకు ‘డ్రిప్‌’ అమలు చేయాలి

8 Dec, 2021 04:57 IST|Sakshi

లోక్‌సభ జీరో అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

సాక్షి, న్యూఢిల్లీ: డ్యామ్‌ల భద్రత, కార్యాచరణ, పనితీరును మెరుగుపరచటానికి ఉన్న కేంద్ర పథకం డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డ్రిప్‌) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని, ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మెరుగుపరచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణాబోర్డు పరిధిలోని ఈ డ్యామ్‌ల భద్రత, నిర్వహణ సక్రమంగా చేయాలని, ఇందుకోసం జలశక్తి శాఖ ప్రత్యేక నిర్వహణ బృందాన్ని నియమించాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఆనకట్ట వైండింగ్‌ పూల్‌  ప్రమాదస్థితిలో ఉందని తెలిపారు. 2020లో నీటి ఉధృతికి నాగార్జునసాగర్‌ కుడికాల్వ గేటు విరిగిపోవడంతో చాలా నీరు వృథాగా పోయిందని చెప్పారు. వీటి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్స్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి: ఎంపీ సత్యనారాయణ
విశాఖ స్టీల్స్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇటీవలే ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించిందని గుర్తుచేశారు. ఒడిశాలోని ఓఎండీసీలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ భారీ పెట్టుబడులు పెట్టిందని, కానీ నేటివరకు ముడిసరుకు ప్లాంటుకు చేరలేదని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, ఇది శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వహణకు అవసరమైన విడిభాగాలు, బ్యాటరీలు అందుబాటులో లేవని తెలిపారు. వీటిని సమకూర్చాలని కోరారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలి: ఎంపీ చింతా అనూరాధ
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చింతా అనూరాధ కేంద్రాన్ని కోరారు. ఏడేళ్లుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. 

వరద నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయండి: నందిగం సురేశ్‌ 
ఇటీవలి అకాల వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, పంటలు భారీగా దెబ్బతిని ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేశ్‌ చెప్పారు. వారిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం అందించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. 

కులగణన చేపట్టాలి: ఎంపీ తలారి రంగయ్య
దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా వికేంద్రీకరణ జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని కోరారు. దేశంలో 75 శాతం సంపద 10 శాతం జనాభా చేతిలో ఉందని చెప్పారు. ఈ అసమానతలు పోవాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు.   

మరిన్ని వార్తలు