మార్మోగిన ‘ప్రత్యేక హోదా’ నినాదం

23 Jul, 2021 04:35 IST|Sakshi

పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన

ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్, దిశ బిల్లు, పోలవరం అంశాలపై చర్చకు రాజ్యసభలో నోటీసులు

పోలవరంపై లోక్‌సభలో సావధాన తీర్మానానికి నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, దిశ చట్టానికి ఆమోద ముద్ర, స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో గురువారం ఆందోళన కొనసాగించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పెట్టుబడి క్లియరెన్స్‌ ఇచ్చి నిధులు విడుదల చేయాలన్న అంశంపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సావధాన తీర్మానం పెట్టేందుకు నోటీసులు ఇచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తోందని, శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, ఈ చర్యల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదల, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఒకవైపు, కాంగ్రెస్‌ తదితర పక్షాలు ఒకవైపు వెల్‌లో ఆందోళన చేపట్టడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఇక రాజ్యసభలో నలుగురు ఎంపీలు వివిధ అంశాలపై చర్చను కోరుతూ 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి  ప్రత్యేక హోదా అంశంపై చర్చ కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు దిశ చట్టం ఆమోదంపై చర్చ కోరుతూ నోటీసులు ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు పెట్టుబడి క్లియరెన్స్‌ పెండింగ్‌లో ఉందని, ఇప్పటివరకు వెచ్చించిన వ్యయం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని, ఈ అంశాలపై చర్చించాలని కోరుతూ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ నోటీసులు ఇచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దీనిని పరిరక్షించాలని, ఈ అంశంపై సమగ్ర చర్చ అవసరమని పేర్కొంటూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఆయా నోటీసులను చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు అనుమతించలేదు. తమ డిమాండ్లపై వైఎస్సార్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర  పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు