YSRCP Plenary 2022: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో  హైలైట్స్‌

9 Jul, 2022 10:43 IST|Sakshi
ఫైల్‌ఫోటో

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. టీడీపీ హయాంలో హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ (వైద్య, ఆరోగ్య శాఖ) అప్పటి సీఎం చంద్రబాబు వెల్త్‌ (ఆదాయం) కోసం పనిచేస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల వెల్‌నెస్‌ (ఆరోగ్యం) కోసం పనిచేస్తోందని చెప్పారు. బాబు వైద్య శాఖలో అవినీతిని విస్తరించారని, సీఎం జగన్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని వివరించారు.
చదవండి: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో శుక్రవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద తీర్మానంపై మంత్రులు రజని, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వైద్య రంగంలో మార్పు తేలేకపోయారని, సీఎం వైఎస్‌ జగన్‌ మూడేళ్లలో అద్భుత మార్పు తెచ్చారని చెప్పారు. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన రంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో చేపడుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధితో 2024లోనూ ఇదే విధమైన చారిత్రక విజయాన్ని అందుకుంటారని తెలిపారు.

వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో  హైలైట్స్‌..
రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు. తద్వారా రాష్ట్రంలోని 85 % (1.40 కోట్ల) కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్యం. 

టీడీపీ హయాంలో ఈ పథకం కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,446 చికిత్సలు అందుతున్నాయి. చికిత్సల సంఖ్యను ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

వెఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్య పెంపు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం

గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5,171 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.5,100 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో రోజుకు సగటున 1500 మందికి వైద్యం అందించగా.. ఇప్పుడు రోజుకు సగటున 3 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 104, 108 సేవలకు జీవం పోసింది. మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 11 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను బలోపేతం చేస్తోంది. 

రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం 

చంద్రబాబుకు శ్రీరామచంద్రుడితో పోలికా!
పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును లోకేష్‌ శ్రీరామచంద్రుడితో పోల్చడం హాస్యాస్పదం. లోకేశ్‌ తనను తాను రాక్షసుడితో పోల్చుకుంటున్నాడు. అతను రాక్షసుడు కాదు.. కమెడియన్‌. మా నాయకుడు జగన్‌ కోసం ఏమైనా చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 50 శాతానికి పైగా పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్‌. 2024లో 175కు 175 సీట్లు గెలుస్తాం. ఇందుకోసం  ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

నాడు ఆరోగ్యశ్రీ ఉండి ఉంటే నా చెల్లి బతికి ఉండేది..
పుట్టుకతో ఉండే గుండె జబ్బు కారణంగా నా సోదరి 1999లో మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా చెల్లికి మెరుగైన వైద్యం అందించలేకపోయాం. అప్పట్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండి ఉంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యాక పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్‌ తనయుడిగా పథకాన్ని ఊహించని రీతిలో వైఎస్‌ జగన్‌ బలోపేతం చేశారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు. టీడీపీ ప్రభుత్వ ఆస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది.
– మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

మరిన్ని వార్తలు