భాషకు పట్టం.. సాహిత్యానికి పీఠం..!

20 Mar, 2023 01:16 IST|Sakshi
మరసం కార్యాలయం, మరసం రజతోత్సవాల కరపత్రాలు ఆవిష్కరిస్తున్న మరసం సభ్యులు

మదనపల్లె సిటీ : ఆ మిత్ర బృందానికి ఒకటే లక్ష్యం. సాహితీ సేద్యంలో భాషామృత ఫలాలను పండించి యువతకు అందించాలని ఆశించారు. విభిన్న వృత్తుల్లో క్షణం తీరిక దొరకని వారైనా.. నిరంతర అన్వేషణ మాత్రం తెలుగు భాషకు వెలుగునివ్వడమే. ఈ మిత్ర మండలి కలకల సాధనమే మదనపల్లె రచయితల సంఘం (మరసం). ఆ సంస్థ ఉగాదికి రజతోత్సవాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 1997లో బీటీ కాలేజీ రిటైర్డు తెలుగు అధ్యాపకులు మల్లెల గురవయ్య, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు కరణం బాలసుబ్రమణ్యం పిళ్లై, సీనియర్‌ జర్నలిస్టు పురాణం త్యాగమూర్తిశర్మ, తొలి మహిళా న్యూస్‌ రీడర్‌ జోళెపాలెం మంగమ్మ, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య తదితరులు తన మిత్ర బృందంతో కలిసి స్థానిక బెంగుళూరు రోడ్డులోని జిజ్ఞాస భవనంలో సంస్థను నెలకొల్పారు. ఈ పాతికేళ్లలో ఏటా ఉగాది రోజున కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఎంతో మంది కవులను ప్రోత్సహిస్తున్నారు. నూతన గ్రంథాలను సమీక్షలు నిర్వహించడంతోపాటు వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. తెలుగు భాష కోసం పాఠశాలల్లో కథల పోటీలు, ఏటా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరసం గౌరవ అధ్యక్షులుగా పురాణం త్యాగమూర్తిశర్మ, అధ్యక్షులుగా ఇంజనీర్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా యుగంధరాచారి, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య, శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు.

కార్యశాలలు, సదస్సులు.. పోటీలు

తెలుగు భాషాభివృద్ది కోసం మరసం కార్యశాలలు, సదస్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటుంది. ప్రతి వారం మరసం కార్యాలయంలో సాహితీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే భాష, బోధన విషయంలో సరిదిద్దుకుంటూ రావాలన్న లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా యువ రచయితలకు పద్య రచన, పాఠ్యాంశ బోధనల్లో కార్యశాలలను నిర్వహించింది. పద్య రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. ఇదంతా నిరంతరం తమ విధిగా మరసం భావించడం ఓ ప్రత్యేకత.

పండుగంటే పండగే : మరసం వారు ఉగాది పండుగ రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి కార్యక్రమాలు మొదలు పెడతారు. కవి సమ్మేళనం, నాటకాలు, కవితలు మొదలగువని నిర్వహిస్తున్నారు. కవులకు సన్మానంతోపాటు ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందజేస్తున్నారు.

22న మరసం రజతోత్సవం

ఉగాది వేడుకలు, కవి సమ్మేళనం

సంస్కృతిని కాపాడటం కోసమే..

పాతికేళ్లుగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. ఇదంతా కేవలం తెలుగు భాషా సంస్కృతులను నిలపడం కోసమే. ఉగాది ఉత్సవానికి ఆడ, మగ అందరూ సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరేది సంస్కృతిని కాపాడదామనే. ఉగాది పండుగ రోజు మా కార్యక్రమానికి వచ్చిన వారు రాత్రి వరకు జరిగే కవితా ప్రదర్శనలను ఆస్వాదిస్తారు. మళ్లీ ఉగాది కోసం ఎదురు చూస్తుంటారు. కవి సమ్మేళనం, నాటకాలు నిర్వహించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం.

– లింగాల యుగంధరాచారి, ప్రధాన కార్యదర్శి, మరసం

22న రజతోత్సవం

మరసం రజతోత్సవ వేడుకలు ఈనెల 22న నిర్వహిస్తున్నాం. 25 ఏళ్ల ప్రస్తానంలో ఈ ఏడాది ఘఽనంగా నిర్వహిస్తాం. అన్నమయ్య కీర్తనలు, మురళీవేణుగానం, కవితాపఠనం, బలరాముడు ఏకాప్రాతాభినయం తదితర కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం కవి సమ్మేళనం జరుగుతుంది. సాహితీవేత్తలు, పట్టణ ప్రముఖలు రజతోత్సవ వేడకలు విజయవంతం చేయాలి.

– పి.వి.ప్రసాద్‌,

మరసం అధ్యక్షులు, మదనపల్లె

మరిన్ని వార్తలు