గుప్తనిధుల ముఠా పట్టివేత

12 Nov, 2023 01:30 IST|Sakshi

గుర్రంకొండ : గుప్తనిధుల ముఠాను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ నగరి పరిసర కొండల్లో పురాతన శివాలయం ఉంది. కొండపైన పెద్దగా జనసంచారం ఉండదు. ఈ నేపథ్యంలో గుప్తనిధుల ముఠా కన్ను ఈ ఆలయంపై పడింది. శుక్రవారం ఐదుగురు వ్యక్తులు నగరి గ్రామానికి చేరుకొని, కొండ దిగువభాగాన వారి మూడు ద్విచక్ర వాహనాలు ఉంచారు. తమ వెంట తెచ్చుకొన్న బ్యాగులు, ఇతర సామగ్రితో కొండపైకి వెళ్లారు. రాత్రి అక్కడే ఉండి శనివారం ద్విచక్రవాహనాల వద్దకు చేరుకొన్న వారిని గ్రామస్తులు గమనించారు. రెండు రోజులుగా కొండపై ఏం పని చేశారు అంటూ ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని పట్టుకొని గ్రామం మధ్యలో ఉంచారు. వారి వద్ద ఉన్న వస్తువులు పరిశీలించగా.. గుప్తనిధుల ముఠా సభ్యుల దగ్గర ఉన్న వాటి వలే ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొండపైన శివాలయం పరిసరాల్లో పెద్ద ఎత్తున పూజలు చేసి, నల్లకోడిని చంపిన ఆనవాళ్లు ఉన్నాయని గొర్రెల కాపరులు పేర్కొన్నారు. పూజల దగ్గర నిమ్మకాలు ఉంచారని, ఆ పక్కనే తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులే ఇటీవల నెల రోజులుగా మూడు మార్లు కొండపైన కనిపించినట్లు చెప్పారు. పోలీసుల విచారణలో నిజాలు తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు