ఈ ఏడాదీ జాతర నిర్వాహకుల మధ్య వివాదం

22 Mar, 2023 23:56 IST|Sakshi
బలిజపల్లెలో బందోబస్తుగా ఉన్న పోలీసులు

రాజంపేట టౌన్‌ : ఈ ఏడాది కూడా బలిజపల్లె గంగమ్మ జాతర నేపథ్యంలో నిర్వాహకుల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆ గ్రామంలో ముందస్తు చర్యగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలు ... గత ఏడాది బలిజపల్లె గంగమ్మ జాతర నిర్వహణకు అంకురార్పణ చేసే సమయంలో ఇరు కుటుంబాలకు చెందిన జాతర నిర్వాహకుల మధ్య వివాదం తలెత్తడంతో అప్పట్లో పోలీసులు జాతరను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ తరువాత రెవెన్యూ, పోలీస్‌శాఖకు చెందిన డివిజన్‌ స్థాయి అఽధికారులు, ప్రజా ప్రతినిధుల జోక్యంతో నెల రోజుల తరువాత జాతరను నిర్వహించారు. అయితే గత ఏడాది తలెత్తిన వివాదం సమసి పోకపోవడంతో ఈ ఏడాది మళ్లీ తెరపైకి వచ్చింది. సాంప్రదాయబద్దంగా ఉగాది రోజున జాతర నిర్వహణకు చాటింపు వేయించాల్సివుండటంతో పోలీసు అధికారులు గత ఏడాది జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అమ్మవారికి సమర్పించే సాంగ్యాల విషయంలో తగువులాడుకుంటున్న ఇరు కుంటుబాల వారిని బుధవారం పిలిపించి మాట్లాడారు. అయితే సాంగ్యాల విషయంలో ఇరు కుటుంబాల వారి మధ్య సయోధ్య కుదరలేదు. అందువల్ల అనేక సంవత్సరాలుగా చాటింపు వేయించే కార్యక్రమంతో పాటు జాతర సందర్భంగా గంగమ్మకు వివిధ సాంగ్యాలు చేసే నిర్వాహకులు వివాదాలు, తగువుల మధ్య తాము చాటింపు వేయించలేమని స్పష్టం చేసి పోలీసులకు లిఖిత పూర్వకంగా రాయించారు. దాదాపు రెండువందల సంవత్సరాలకు పైగా జాతర చరిత్రలో ఉగాది కంటే ముందు జాతర జరగకుంటే ఉగాది రోజున చాటింపు వేయక పోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇదిలావుంటే ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో ఎంతో విశిష్టత సంతరించుకున్న బలిజపల్లె గంగమ్మ జాతర విషయంలో కొంత మంది నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపట్ల భక్తులు పెదవి విరిస్తున్నారు. కాగా డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరసింహారావు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలిజపల్లె గ్రామంలో బుధవారం రాత్రి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అధికారుల ఆదేశాలు బేఖాతర్‌

గత ఏడాది జాతర సందర్భంగా నిర్వాహకుల మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు పలు దపాలు పంచాయితీలు చేశారు. ఆ సందర్భంగా తొలి నుంచి అమ్మవారికి ఎవరెవరు ఏయే సాంగ్యాలు చేస్తున్నారో విచారించి, పాతపద్ధతుల్లోనే జాతర నిర్వహించుకోవాలని నిర్వాహకులందరికీ సూ చించారు. అలాగే ఎవరెవరు ఏయే సాంగ్యాలు చేస్తారో ఓ జాబితాను కూడా తయారు చేసి నిర్వాహకులకు ఇచ్చారు. అయితే నిర్వాహకులు ఈ ఏడాది అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి వివాదాలకు దిగడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశమైంది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో అధికారులు తీసుకునే నిర్ణయం మేరకు జాతర నిర్వహణ ఆధారపడివుంది.

చాటింపు వేయించకుండా

నిలిపివేసిన వైనం

బలిజపల్లెలో పోలీసు బందోబస్తు

>
మరిన్ని వార్తలు