ఇవిగో నవరత్నాల వెలుగులు.. కరువు నేలపై జలధారలు

18 Dec, 2023 06:00 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

జీవన సంధ్యలో హాయిగా... 
నా వయస్సు 68 ఏళ్లు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భార్య భానుమతి దివ్యాంగురాలు. నాకు బాల్యం నుంచీ కష్టాలే. హోటల్‌లో కూలీ పని చేశాను. చాలా కాలంగా పూలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రతి రోజూ కడియం వెళ్లి, పూలు కొనుక్కుని వచి్చ, అమ్ముతుంటాను. అయినా తగినంత ఆదాయం రావడం లేదు.

ఒక్కోసారి నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నా భార్యకు వికలాంగ పింఛను వస్తుండడంతో నాకు రాదని అనుకునే వాడిని. వయస్సు రీత్యా ఆరోగ్యం సహకరించక పూల కోసం వెళ్లలేకపోతే ఇంట్లో గడవడం కష్టంగా ఉండేది. ఈ సమయంలో మా వలంటీరు షేక్‌ అనీషా వలి మా వద్దకు వచ్చి ‘తాత గారూ.. మీ భార్యది దివ్యాంగుల పెన్షన్‌ కాబట్టి, వయస్సు ప్రకారం మీకూ పెన్షన్‌ వస్తుంది’ అని చెప్పి నాతో దరఖాస్తు చేయించింది. ఇప్పుడు మా ఇద్దరికీ ప్రభుత్వ పింఛను వస్తోంది. వృద్ధాప్యంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాకు కొండంత అండగా నిలిచింది. మా బతుకు సాఫీగా సాగిపోతోంది.  – నల్లమిల్లి నరసింహమూర్తి, రామచంద్రపురం (నరాల రాధాకృష్ణ, విలేకరి, రామచంద్రపురం రూరల్‌) 

పిల్లల చదువు బెంగ తీరింది 
మేము తిరుపతి సీఎస్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్నాము. నా భర్త ఆటో నడుపుతున్నాడు. నేను గృహిణిని. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి 9వ తరగతి, అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నారు. ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబం గడవడానికే సరిపోతోంది. పిల్లల చదువుల విషయంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లం. ప్రస్తుత పరిస్థితిలో పిల్లలకు మంచి చదువులు ఎలా చదివించాలా అని నిత్యం సతమతం అయ్యేవాళ్లం. ఈ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం అమలు చేస్తుండటం వల్ల మాలాంటి పేద కుటుంబాలను ఆదుకుంటోంది.

ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున నా ఖాతాలోకి నగదు జమ చేశారు. పిల్లల చదువుల కోసం ఇంత పెద్ద మొత్తం అధికారులతో కానీ, రాజకీయ నేతలు, మధ్యవర్తులతో సంబంధం లేకుండా తల్లుల ఖాతాలోకి జమ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మధ్యాహ్నం స్కూల్లో మంచి భోజనం పెడుతున్నారు. మాకు ఆటో ఉండటంతో ఏటా వాహనమిత్ర ద్వారా కూడా రూ.10 వేలు అందుతోంది. ఇప్పుడు మాకు బతుకుపై ఎలాంటి భయం లేదు.  – కె.లక్ష్మీ, సీఎస్‌ఆర్‌ కాలనీ, తిరుపతి (పి.చంద్రబాబు, విలేకరి, తిరుపతి సిటీ) 

కరువు నేలపై జలధారలు  
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చిలకావారిపల్లిలో నాకు 23 ఎకరాల పొలం ఉంది. నీటి పారుదల సౌకర్యం లేక 13 ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి.. బోరు బావిని నమ్ముకొని మామిడి చెట్లు నాటాను. వాటిని బతికించుకొనేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చేది. అయినా ఎంతో ఓర్పుతో మామిడి తోట కాపాడుకున్నాను. మిగిలిన 10 ఎకరాల భూమి బీడుగా పెట్టాల్సి వచ్చిది.

నాలాగే మా ప్రాంత రైతాంగం నీటి పారుదల సౌకర్యం లేని కారణంగా వర్షాధార పంటలు వేసేవారు. కొందరు పొలాలు బీడు పెట్టేవారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్న సమయంలో జలయజ్ఞం పుణ్యమా అని సుమారు రూ.350 కోట్లతో నేతిగుట్లపల్లెలో ఒక టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్‌ నిర్మించారు. హంద్రీ–నీవా నీటితో నింపారు. ఫలితంగా ఐదారు గ్రామాల పరిధిలోని సుమారు పది వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఒక పంట కాదు.. మూడు పంటలు వేసుకునేలా వైఎస్‌ జగన్  సర్కారు భరోసా ఇచ్చింది.

ప్రాజెక్టుల్లో నీళ్లు నిలువ ఉండటం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయి. నేను బీడు పెట్టిన 10 ఎకరాల పొలంలో ఇప్పుడు కొబ్బరి, జామ, సీతాఫలం చెట్లు నాటాను. మామిడి తోటకు అంతర్‌ పంటలుగా టమాటా, ఇతర కూరగాయల పెంపకం చేపట్టాను. సోమల మండలం ఆవులపల్లె వద్ద మరో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు రిజర్వాయర్ల పనులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్బుద్ధితో.. టీడీపీ నేతలతో కోర్టులో కేసులు వేయించడంతో ఈ రిజర్వాయర్‌ను ప్రారంభించ లేదు. అయినా భూగర్భ జలాలు బాగా పెరిగినందున ఈ రిజర్వాయర్‌ కింద భూములు ఉన్న రైతాంగానికి ఎంతో మేలు జరుగుతోంది.    – రామకృష్ణారెడ్డి, రైతు, చిలకావారిపల్లి (పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్, విలేకరి, పుంగనూరు)  

>
మరిన్ని వార్తలు