పర్యాటకం.. సరికొత్త సౌరభం | Sakshi
Sakshi News home page

పర్యాటకం.. సరికొత్త సౌరభం

Published Sun, Dec 24 2023 1:20 AM

- - Sakshi

డోన్‌: పర్యాటక ఖిల్లాగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలో మరో రెండు పర్యాటక ప్రాంతాలు చేరబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెలూం గుహలు జిల్లాలో ఉండటం విశేషం. వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా మరో రెండు గుహలు యాత్రికుల సందర్శనకు సిద్ధమవుతున్నాయి. ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా ఏర్పడిన బిల్లసర్గం గుహలు, వాల్మీకి గుహల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ గుహలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. డోన్‌ నియోజవకర్గం బేతంచెర్ల మండల కేంద్రానికి 3.5 కి.మీ దూరంలో కనుమకింద కొట్టాల గ్రామానికి సమీపంలో ఉన్న బిల్లసర్గం గుహలు 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.

అలాగే ప్యాపిలి మండల కేంద్రం నుంచి 20 కి.మీ దూరంలో హుస్సేనాపురం, నల్లమేకల పల్లి మీదుగా బోయ వాండ్లపల్లికి వెళ్లే మార్గంలో 30 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి గుహలు ఉన్నాయి. పూర్వాశ్రమంలో వాల్మీకి మహర్షి ఈ గుహల్లో తపస్సు చేశారని, అందుకే ఈ గుహలకు వాల్మీకి గుహలుగా ప్రసిద్ధి చెందాయి. బిల్లసర్గం గుహలు, వాల్మీకి గుహలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6. కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. జిల్లాలో ఇప్పటికే శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం క్షేత్రాలతో పాటు, రాక్‌ గార్డెన్‌, బెలుం కేవ్స్‌, నల్లమల ఎకో పార్క్‌లు ఉండటంతో నిత్యం పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు గుహలు పర్యాటకులకు అందుబాటులోకి వస్తుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భూతల స్వర్గంగా..
రాష్ట్రంలోని బొర్రా, బెలుం గుహలకు దీటుగా బిల్లసర్గం, వాల్మీకి గుహలను టూరిజం శాఖ అధికారులు వేగంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి, మట్టి ఆకృతులకు మరింత అందంగా కనిపించేలా లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 25 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి గుహలు, 15 ఎకరాల విస్తీర్ణంలో బిల్లసర్గం గుహలను అభివృద్ధి చేస్తున్నారు. గుహల సమీపానికి వాహనాలు వెళ్లేలా రహదారులను నిర్మించారు. గుహ లోపల యాత్రికులు నడిచేందుకు వీలుగా బండపరుపు, మెట్లు వేశారు. గుహల బయట చిన్నారులు ఆడుకునేందుకు ఆట స్థలాలు, పార్కులు, విడిది కేంద్రాలు శరవేగంగా నిర్మిస్తున్నారు. రెస్టారెంట్లను కూడా నెలకొల్పుతున్నారు. వారం క్రితం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన బిల్లసర్గం గుహలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. జనవరి నెలాఖారుకు ప్రారంభించేలా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గుహ ఆవరణలో యాత్రికులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు.

పర్యాటక కేంద్రంగా డోన్‌
రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తున్న డోన్‌ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డోన్‌ నియోజకవర్గాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక, ఉపాధి, నీటిపారుదల రంగాలతో పాటు టూరిజం అభివృద్ధికి కూడా నిధులు సమృద్ధిగా విడుదల చేస్తున్నారు. ఓ వైపు విద్యా హబ్‌గా మారిన డోన్‌ పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుంది. ఇప్పటికే డోన్‌ సమీపంలో నగర వనం ఏర్పాటు చేయడంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మరో వైపు వెంగళాంపల్లి, వెంకటాపురం చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌, బోటు షికారు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు మరో రూ.6 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

వాల్మీకి గుహలో రంగురంగుల విద్యుత్‌ కాంతులు
1/1

వాల్మీకి గుహలో రంగురంగుల విద్యుత్‌ కాంతులు

Advertisement

తప్పక చదవండి

Advertisement