ట్విటర్‌ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..!

30 Nov, 2021 17:44 IST|Sakshi

Here’s a Look at 10 Indian-Origin CEOs: నవంబర్ 29న సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను ట్విటర్‌ కంపెనీ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరడజనుకు పైగా గ్లోబల్ టెక్ కంపెనీలు భారతీయ-అమెరికన్ల నేతృత్వంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్​, ఐబీఎం​ లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్‌ అగర్వాల్‌ చేరారు. ఇప్పుడు ఎక్కడ చూసిన భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఈ విషయంపై ఎలన్‌ మస్క్‌ స్పందించారు. భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఐర్లాండ్‌ బిలియనీర్‌, స్ట్రయిప్‌ కంపెనీ సీఈవో ప్యాట్రిక్‌ కొల్లైసన్‌ చేసిన ఆసక్తికరమైన ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు. పరాగ్​ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇతర ప్రసిద్ధ సంస్థలకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయుల వివరాలు చూద్దాం.

సుందర్ పిచాయ్: తమిళ నాడులో జన్మించిన సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. మాజీ  సీఈఓ ఎరిక్ ష్మిత్, సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తర్వాత సంస్థ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ‌స‌ర్‌గా సుందర్ పిచాయ్ ఎన్నికయ్యారు. అలాగే, 2019 డిసెంబరులో పిచాయ్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు కూడా సీఈఓ అయ్యారు. 

సత్య నాదెళ్ల: హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్‌గానూ ఎదిగారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్‌, సీఈఓగా కొనసాగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. 

అరవింద్ కృష్ణ: భారతీయ సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అరవింద్ కృష్ణ అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబిఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ‌స‌ర్‌గా 2020 జనవరిలో జనవరి ఎంపికయ్యారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు. 1990లలో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎంలో చేరారు. గిన్ని రోమెట్టి ఐబీఎం సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో జనవరి 2020లో ఐబీఎం సీఈఓగా అరవింద్​ కృష్ట  నియమితులయ్యారు. 

శంతను నారాయణ్: భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ శంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ ఇంక్ చైర్మన్, అధ్యక్షుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ‌స‌ర్‌గా కొనసాగుతున్నారు. అంతక ముందు 2005 నుంచి కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీ‌స‌ర్‌గా ఉన్నారు. శంతను నారాయణ్ భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించాడు. సృజనాత్మక డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్‌వేర్ ఫ్రాంచైజీలను పెంచేస్తూ కంపెనీని బాగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

రంగరాజన్ రఘురామ్‎: భారత సంతతికి చెందిన ‎రంగరాజన్ రఘురామ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ విఎంవేర్ కొత్త సీఈఓగా 2021 జూన్ నెలలో ఎంపికయ్యారు. 2003లో కంపెనీలో చేరిన రఘురామ్ జూన్ 1న సీఈఓ పదివిని చేపట్టారు. విఎమ్ వేర్ ప్రధాన వర్చువలైజేషన్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

జయశ్రీ ఉల్లాల్: జయశ్రీ వి. ఉల్లాల్ ఒక అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓగా  2008 నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు.

లక్ష్మణ్ నరసింహన్: గతంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీ‌స‌ర్‌గా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 2019లో రాకేష్ కపూర్ తర్వాత రెకిట్ బెంకిసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు.

రాజీవ్ సూరి: 1967 అక్టోబరు 10న జన్మించిన రాజీవ్ సూరి ఒక సింగపూర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్చి 1 2021 నుంచి ఇన్మార్శాట్ సీఈఓగా పనిచేస్తున్నారు. అతను గతంలో 31 జూలై 2020 వరకు నోకియా సీఈఓగా ఉన్నారు. 

దినేష్ సి. పాల్వాల్: పాల్వాల్ 2007 నుంచి 2020 వరకు హర్మన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా పనిచేశారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతను సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డుకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు.

పరాగ్ అగ్రవాల్: ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు.

మరిన్ని వార్తలు