ఈ తరహా టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

16 Dec, 2023 16:44 IST|Sakshi

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త టెక్నాలజీ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా.. విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయం, గేట్లకు రూట్, ఆఫర్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేస్తూ చాలా సహాయపడతాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 3 వేల బ్యాగేజీ ట్రాలీలు ఉన్నట్లు సమాచారం. 

ప్రపంచంలో స్మార్ట్‌ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్ కావడం విశేషం. వినియోగదారు ఈ ట్రాలీని నో జోన్ ఏరియాలోకి తీసుకెళ్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఫ్లైట్ లేట్ అయితే కూడా ముందస్తుగా నోటిఫికేషన్ రూపంలో డిస్ప్లే చేస్తుంది.

ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?

ఈ ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు కూడా స్క్రీన్‌ మీద కనిపిస్తాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్‌‌కు టైమ్ ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితో పాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి.

ఆనంద్ మహీంద్రా ట్వీట్..
స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ టెక్నాలజీ చాలా బాగుందని, విదేశాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ చూడలేదని ఇది 'ప్రెట్టీ కూల్' అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపైన తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు