Vehicle scrappage policy: వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌

7 Oct, 2021 07:40 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ ఆటోమొబైల్‌ స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పాత వాహనాలను స్క్రాప్‌కి ఇచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్‌ ట్యాక్స్‌లో 25 శాతం దాకా రిబేట్‌ ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. 

కాలుష్యం వెదజల్లుతున్న పాత వాహనాలను వదిలించుకునేలా వాహదారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ప్రెస్‌ నోట్‌లో పేర్కొంది. దీని ప్రకారం రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలకు 25 శాతం దాకా, రవాణా (వాణిజ్య)వాహనాలకు 15 శాతం దాకా కన్సెషన్‌ లభించగలదని కేంద్రం తెలిపింది. రవాణా వాహానాలకు ఎనిమిదేళ్ల దాకా, రవాణాయేతర వాహనాలకు 15 ఏళ్ల వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది.

ఈ నిబంధనలు 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ ఆటోమొబైల్‌ స్క్రాపేజీ విధానాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీని ప్రకారం 2023 ఏప్రిల్‌ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ తప్పనిసరి కానుంది. మిగతా కేటగిరీల వాహనాలకు 2024 జూన్‌ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తారు.

చదవండి: కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు