సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..! యూకేను వెనక్కి నెట్టి...!

22 Dec, 2021 21:23 IST|Sakshi

India Overtakes UK To Third Spot With 54 Unicorns Hurun Index: భారత్‌లో స్టార్టప్స్‌ దూసుకెళ్తున్నాయి. తక్కువ సమయంలోనే ఒక బిలియన్‌ డాలర్ల విలువైన యూనికార్న్‌ స్టార్టప్స్‌గా అవతరిస్తున్నాయి. హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2021 ప్రకారం....యూనికార్న్‌ స్టార్టప్స్‌ విషయంలో  భారత్‌ సరికొత్త రికార్డును సృష్టించింది.

యూకేను వెనక్కి నెట్టి..మూడోస్థానంలో..
2021లో భారత స్టార్టప్స్‌ అదరగొట్టాయి. హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2021 ప్రకారం...భారత్‌ 54 యునికార్న్‌లను కలిగి ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్స్‌ను కల్గిన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే భారత్‌లో యునికార్న్‌ల సంఖ్య అధికంగా పెరిగింది. యూనికార్న్‌ స్టార్టప్‌ విషయంలో యూకేను వెనక్కి నెట్టి భారత్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే విదేశాలలో భారతీయులు స్థాపించిన మరో 65 యునికార్న్‌లు ఉన్నాయి. ప్రధానంగా సిలికాన్ వ్యాలీలో, స్వదేశీ యునికార్న్‌ల శాతం మూడింట ఒక వంతు నుండి 45 శాతానికి పెరిగిందని  హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ అన్నారు. 

ప్రపంచంలోనే 15వ యూనికార్న్‌గా బైజూస్‌...
హురున్ ఇండియా ప్రకారం...భారత యునికార్న్‌ల జాబితాలో ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫారమ్ బైజూస్‌ 21 బిలియన్ డాలర్లతో భారత్‌లో తొలిస్ధానంలో ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద 15వ యూనికార్న్‌ స్టార్టప్‌గా బైజూస్‌ అవతరించింది. భారత్‌లో 12 బిలియన్‌ డాలర్లతో యాడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌మొబీ రెండో స్థానంలో, 9.5 బిలియన్‌ డాలర్లతో ఓయో మూడో స్థానంలో నిలిచాయి.  ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్‌ రంగంలో 122 యునికార్న్‌లు ఉన్నాయని, వాటిలో 15 భారత్‌లో ఉన్నాయని హురున్‌ నివేదిక పేర్కొంది. ఈ-కామర్స్ రంగంలో భారత్‌ మూడో అతి పెద్ద మార్కెట్‌​ కల్గి ఉంది. 

చదవండి: కాలేజ్‌ డ్రాప్‌అవుట్స్‌..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..!

మరిన్ని వార్తలు