5% పెరగనున్న ఏసీల ధరలు 

6 Apr, 2022 04:20 IST|Sakshi

పెరిగిన తయారీ వ్యయాలు 

రెండంకెల విక్రయాలపై కంపెనీల అంచనాలు 

ఆఫర్లను తగ్గించిన కంపెనీలు

న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్‌లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు మార్జిన్లపై ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ సీజన్‌లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని అంచనా వేసుకుంటున్న కంపెనీలు.. తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి.

ఏప్రిల్, మే నెలల్లో వేసవి సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు అవుతాయంటూ భారత వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా ఏసీల విక్రయాలపై కంపెనీల్లో ఆశలు పెంచాయి. గత రెండు వేసవి సీజన్లలో కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా అమ్మకాలు ఆశించిన మేర లేవు. దీంతో అప్పుడు నిలిచిన డిమాండ్‌ కూడా తోడయ్యి, ఈసీజన్‌లో అమ్మకాలు జోరుగా ఉండొచ్చని  వోల్టాస్, హిటాచి, ఎల్‌జీ, ప్యానాసోనిక్, గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ అంచనా వేస్తున్నాయి.

ఏసీ తయారీ కంపెనీలు గత త్రైమాసికంలో ధరలను ఒక విడత పెంచాయి. ఏసీల తయారీలో వినియోగించే అల్యూమినియం, కాపర్‌ ధరలు గణనీయంగా పెరగడంతో ఈ పనిచేయక తప్పలేదు. ఉదాహరణకు గతేడాది వరకు 3 స్టార్‌ ఇన్వర్టర్‌ స్లి్పట్‌ ఏసీ ధర రూ.33,500 స్థాయిలో ఉంటే, తాజాగా దీని ధర రూ.36,500–37,000కు చేరడం గమనార్హం.

మరోవైపు ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు ఆకర్షణీయమైన ఈఎంఐ పథకాలను కూడా అందిస్తున్నాయి.  ‘‘2021–22లో ధరలను రెండంకెల స్థాయిలో పెంచాల్సి వచ్చింది. ఇది ఈ వేసవి సీజన్‌లో వినియోగదారుల కొనుగోళ్లకు ప్రతికూలంగా మారదని భావిస్తున్నాం. కస్టమర్ల సౌలభ్యం కోసం ఆఫర్లకుతోడు, సులభ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నాం’’అని వోల్టాస్‌ ఎండీ, సీఈవో ప్రదీప్‌ బక్షి తెలిపారు.   

మే నుంచి ధరల భారం.. 
కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) వార్షిక విక్రయాల్లో 40–50 శాతం మేర ఈ వేసవి సీజన్‌లో నమోదవుతాయని అంచనా వేస్తోంది. గడిచిన 18 నెలల్లో కన్జ్యూమర్‌ అప్లయన్సెస్‌ ధరలు 15 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. కమోడిటీ ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరల పెరుగుదల భారాన్ని పరిశ్రమ చూస్తున్నట్టు పేర్కొంది.

‘‘ధరల పెరుగుదల ప్రభావం వినియోగదారులపై వెంటనే ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్చి–ఏప్రిల్‌ నెలలకు సరిపడా నిల్వలు ఇప్పటికే సమకూర్చడం జరిగింది. మే నుంచి తదుపరి ధరల పెరుగుదల అమల్లోకి రావచ్చు’’ అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజ తెలిపారు. ఈ సీజన్‌లో వినియోగ డిమాండ్‌ దెబ్బతినకుండా రేట్ల పెంపును అమలు చేయడం తమకు సవాలని జాన్సన్‌ కంట్రోల్స్‌ హిటాచి ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా చైర్మన్, ఎండీ, గుర్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ధరల భారం సర్దుబాటు చేసుకునేందుకు తమవైపు నుంచి వీలైనంత ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

గతేడాది ఇచ్చి న ఆఫర్లను సైతం ప్రస్తుత సీజన్‌కు వచ్చే సరికి తగ్గించేసినట్టు గుర్మీత్‌సింగ్‌ తెలిపారు. తాము ధరల పెంపు విషయంలో వేచి చూస్తున్నట్టు గో ద్రేజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌నంది తెలిపారు. ‘గత 2 వేసవి సీజన్లపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. దాంతో చాలా మంది కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడం, హైబ్రిడ్‌ పని నమూనా వినియోగ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నాం’ అని కమల్‌ నంది తెలిపారు.   

మరిన్ని వార్తలు