ఓరియంట్‌ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!

19 Oct, 2023 18:35 IST|Sakshi

ఇప్పటికే అంబుజా, సంఘీ, ఏసీసీ సిమెంట్ల కొనుగోలు

సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్‌ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్‌ సిమెంట్‌ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్‌ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్‌ సిమెంట్‌ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్‌ సిమెంట్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్‌ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్‌ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్‌ 250 కిలోగ్రాములుగా ఉంది.

మరిన్ని వార్తలు