ముంబై ఎయిర్‌పోర్టు : అదానీకే మెజారిటీ వాటా 

31 Aug, 2020 19:07 IST|Sakshi

జీవీకేతోపాటు, 74 శాతం వాటా అదానీ సొంతం

సాక్షి,ముంబై: అంచనాలకు అనుగుణంగానే గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ముంబైలో భారతదేశపు రెండవ అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (మియాల్)లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అదానీ రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది.

ఈ లావాదేవీ కింద ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్రయంలోని  జీవీకె గ్రూపులో 50.5 శాతం వాటాతోపాటు, మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఎసిఎస్‌ఎ) 10 శాతం, బిడ్‌వెస్ట్  13.5 శాతంవాటా,  మొత్తం 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. మ‌రో 26 శాతం ఎయిర్‌ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఈ వాటా అమ్మకాల ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసిన ఇన్‌ఫ్రా దిగ్గజం జీవీకే కోర్టును ఆశ్రయించింది. కానీ రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో  చిక్కుల్లో పడ్డ జీవీకే నిధులను సమకూర్చుకోలేక వైఫల్యం చెందింది. కాగా పారిశ్రామిక దిగ్గజంగా వెలుగొందుతున్నఅదానీ గ్రూప్‌ ‘భారతదేశపు ప్రముఖ విమానాశ్రయ ఆపరేటర్’ కావాలనే ప్రణాళికలను బహిరంగంగా వెల్లడించిన అదానీ ఆవైపుగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే లక్నో, జైపూర్‌, గౌహతి, అహ్మదాబాద్‌, తిరువనంతపురం, మంగళూరుల్లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు