బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ : ప్రపంచంలోనే తొలి 20 బిలియనీర్ల జాబితాలో గౌతమ్‌ అదానీకి చోటు

29 Nov, 2023 15:45 IST|Sakshi

భారత బిలియనీర్ గౌతమ్‌ అదానీ జెట్‌ స్పీడ్‌తో తన సంపదను పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ జాబితాలో ప్రపంచంలో తొలి 20 ధనవంతుల జాబితాలో 19వ స్థానాన్ని దక్కించుకున్నారు. 

మంగళవారం అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత కంపెనీల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దీంతో ఆ ఒక్కరోజే అదానీ గ్రూప్‌ మొత్తం కంపెనీల మార్కెట్‌ కేపిటల్‌ వ్యాల్యూ లక్ష కోట్లకు చేరింది. అదే రోజు అదానీ వ్యక్తిగత సంపద సైతం 6.5 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

ప్రపంచంలోని ఇతర బిలియనీర్లు జూలియా ఫ్లెషర్ కోచ్ అండ్‌ ఫ్యామిలీ (64.7 బిలియన్ డాలర్లు), చైనాకు చెందిన జాంగ్ షన్షాన్ (64.10 బిలియన్ డాలర్లు), అమెరికాకు చెందిన చార్లెస్ కోచ్ (60.70 బిలియన్ డాలర్లు)లను వెనక్కి నెట్టారు. 

ఒక్క రోజులో లక్ష కోట్లు  
నవంబర్‌ 28,2023 నాటికి అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల మొత్తం విలువ రూ.11,31,096కి చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ మంగళవారం ఒక్కరోజే మార్కెట్‌ విలువ రూ.1.04లక్షల కోట్లకు పెరిగింది. అయితే, గ్రూప్ మార్కెట్ క్యాప్ జనవరి 24న గరిష్ట స్థాయి రూ.19.19 లక్షల కోట్ల నుంచి 41 శాతం తగ్గింది.ఇక స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీలు భారీ ర్యాలీ చేయడానికి కారణం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలే కారణమని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. 

సెబీని అనుమానించలేం
హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు పై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా ‘సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నిటినీ వాస్తవాలుగా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేదని పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంలో దాఖలైన పలు కేసులపై వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. 

మరిన్ని వార్తలు