'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన

29 Nov, 2023 11:34 IST|Sakshi

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా, ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన హర్ష్ గోయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా మంగళవారం ఉత్తరకాశీలోని సిల్‌క్యారా టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్పందించారు. 

ఉత్తరాఖండ్‌లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను సురక్షితంగా రక్షించడంతో ఆపరేషన్ పూర్తయింది. నవంబర్ 12న సిల్‌క్యారా టన్నెల్‌ కూలిపోవడంతో కార్మికులు 17 రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయారు. దాంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించింది. చివరకు మంగళవారం అందరినీ విజయవంతంగా బయటకుతీశారు. దాంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రెస్క్యూ సిబ్బంది, కార్మికులకు అభినందనలు తెలిపారు. 

రెస్క్యూ వర్కర్లకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా సెల్యూట్ చేశారు. ఈ పోరాటంలో కోట్లాది మంది దేశప్రజల ఆశ ఫలించిందని ఆయన అన్నారు. 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా తిరిగి వచ్చిన 41 మంది కార్మికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో సహా ఈ రెస్క్యూ మిషన్‌లో భాగంమైన అందరికీ అభినందనలు చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసే ఈ కార్మిక సోదరులందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మహీంద్రా గ్రూప్ ఛైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ విజయవంతం కావడంలో 'రాథోల్ మైనర్ల' పాత్రను ప్రశంసించారు. అధునాతన డ్రిల్లింగ్ పరికరాల తర్వాత, వీరు కీలకంగా మారి చివరి నిమిషంలో కార్మికులను కాపాడారని కొనియాడారు. ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ పరిస్థితిని వివరించినందుకు అభినందనలు తెలిపారు. 

ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా కూడా 41 మంది ప్రాణాలను కాపాడటంలో శ్రమించినందుకు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఇండియాకు వ్యతిరేకంగా రన్నులు కొట్టారన్నారు. కానీ అదే దేశానికి చెందిన డిక్స్‌ మాత్రం ఇండియాలోని 41 మంది కార్మికులను కాపాడేందుకు శ్రమించారని తెలిపారు. 

బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా రెస్క్యూ వర్కర్లను ప్రశంసించారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డానికి వీరోచితంగా పోరాడిని సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు.

మరిన్ని వార్తలు