అదానీ–హిండెన్‌బర్గ్‌ అంశంపై సుప్రీం కోర్టు ఆరా

25 Nov, 2023 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర అస్థిరత నుండి పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల రెగ్యులేటర్‌ ఏమి చేయాలనుకుంటోందని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదానీ–హిండెన్‌బర్గ్‌ వ్యవహారానికి సంబంధించి దాఖలైన బ్యాచ్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సెబీకి ఈ ప్రశ్న సంధించింది. ఈ పిటిషన్‌లను సుప్రీంకోర్టు అనుమతించడానికి ప్రధాన కారణాలలో స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర అస్థిరతి ఒకటని తెలిపింది.

‘‘పెట్టుబడిదారుల తన పెట్టుబడి విలువను భారీగా కోల్పోయే ఈ తరహా  అస్థిరతనుండి ఇన్వెస్టర్‌ను రక్షించడానికి సెబీ ఏమి చేయాలనుకుంటోంది. నిబంధనలను కఠినతరం చేసే దిశలో ఆలోచన చేస్తోందా?’’ అని జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలు కూడా ఉన్న త్రిసభ్య  ధర్మాసనం సెబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించింది. అన్ని స్థాయిల్లో నిబంధనల పటిష్టతకు సెబీ తగిన చర్యలు తీసుకుంటోందని మెహతా ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. మార్కెట్‌  తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెబీ తీసుకుంటున్న చర్యలను అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనితో ఈ అంశంపై తన ఉత్తర్వులను బెంచ్‌ రిజర్వ్‌ చేసుకుంది.  

24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు పూర్తి! 
కాగా, అదానీ గ్రూపుపై ఆరోపణలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు ముగిసిందని సొలిసిటర్‌ జనరల్‌ తొలుత ధర్మాసనానికి తెలియజేశారు. మిగిలిన రెండింటి కోసం విదేశీ నియంత్రణ సంస్థల నుండి సమాచారం అవసరమని తెలిపారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించారు. షార్ట్‌ సెల్లింగ్‌కు సంబంధించినంత వరకు తప్పు జరిగినట్లు  సెబీ ఏదైనా గుర్తించిందా అని  బెంచ్‌ అడిగిన ప్రశ్నకు మెహతా సమాధానం చెబుతూ తప్పు ఎక్కడ జరిగినట్లు గుర్తించినా, సెబీ చట్టం ప్రకారం  రెగ్యులేటర్‌ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించినంతవరకు, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ నుండి సూచనలు అందినట్లు తెలిపారు.

బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నియంత్రణ వైఫల్యం లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ మేలో సమర్పించిన మధ్యంతర నివేదికలో పేర్కొంది. అయితే 2014 నుంచి 2019 మధ్య చేసిన పలు సవరణలు నియంత్రణ సంస్థ దర్యాప్తు సామర్థ్యాన్ని నిరోధించిందని అలాగే విదేశీ సంస్థల సంస్థల నుండి వచ్చిన నిధుల విషయంలో ఉల్లంఘనలపై దర్యాప్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలు, షేర్‌ ధరల తారుమారు వంటి ఆరోపణలతో  హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.  అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌  కొట్టిపారేసింది. ఇవి సత్యదూరాలని స్పష్టం చేసింది. గ్రూప్‌ కార్యకలాపాలనీ చట్టప్రకారం, పారదర్శకంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు