2030 నాటికి మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్‌ - ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్‌

30 Jan, 2024 08:03 IST|Sakshi

ఇన్‌ఫ్రా రంగంలో ప్రధాన పాత్ర

క్యాంటర్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ నివేదిక

న్యూఢిల్లీ: 2030 నాటికల్లా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలన్న భారత్‌ ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్‌ కీలకంగా ఉండనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ క్యాంటర్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ అండ్‌ కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్‌ .. మౌలిక రంగ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) 50 శాతం పైగా లాభాలను అందించగలదని కంపెనీపై కవరేజీని ప్రారంభిస్తూ జనవరి 28న రాసిన నోట్‌లో వివరించింది. 

‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశం 2030 నాటికల్లా మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడికి చేరుకోవాలంటే భారత్‌ ఇటు డిజిటల్‌ అటు భౌతిక మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్‌ చేయాలి. ఇంధన వినియోగం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా పెరగాలి. భారత్‌ ఆకాంక్షిస్తున్న వాటన్నింటి సాధనకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కీలకమైనదిగా ఉంటుంది‘ అని క్యాంటర్‌ పేర్కొంది.

భారీ పోర్ట్‌ఫోలియో..
ఎయిర్‌లైన్‌ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌లో దాదాపు 25 శాతం వాటా, కార్గోలో 33 శాతం వాటా ఉండే ఎనిమిది ఎయిర్‌పోర్టులు అదానీ గ్రూప్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అనేక డేటా సెంటర్లు నిర్మిస్తోంది. 5,000 కి.మీ. మేర రహదారుల నిర్మాణానికి కాంట్రాక్టులు ఉన్నాయి. ఏఈఎల్‌ రిస్కు–రివార్డుల నిష్పత్తి ప్రస్తుత స్థాయిలో ఆకర్షణీయంగా ఉన్నట్లు క్యాంటర్‌ వివరించింది. 

దేశీయంగా పబ్లిక్‌గా ట్రేడవుతున్న అతి పెద్ద నాన్‌–ఫైనాన్షియల్‌ కంపెనీల్లో 10వ స్థానంలో ఉన్నప్పటికీ ఏఈఎల్‌పై దాదాపుగా అనలిస్టు కవరేజీ లేకపోవడమనేది అదానీ గ్రూప్‌ సంస్థలపై ఇన్వెస్టర్లలో అంతగా అవగాహన లేకపోవడానికి కారణమని పేర్కొంది. 

హిండెన్‌బర్గ్‌ నివేదికతో తీవ్రమైన ఆందోళనలు తెరపైకి వచ్చినప్పటికీ .. గవర్నెన్స్‌ను, పారదర్శకతను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ రిస్కులను తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు తీసుకుందని నోట్‌లో క్యాంటర్‌ తెలిపింది. ‘ప్రస్తుత దశలో విస్మరించ వీలు లేనంత పెద్ద గ్రూప్‌ అదానీది. అదానీకి దేశం అవసరం ఎంత ఉందో భారత్‌కి కూడా అదానీ అవసరం అంతే ఉందని మేము భావిస్తున్నాం‘ అని పేర్కొంది.

whatsapp channel

మరిన్ని వార్తలు