విదేశీ చెల్లింపులకు డిజిటల్‌ కరెన్సీ!: నిర్మలా సీతారామన్‌

30 Jan, 2024 07:54 IST|Sakshi

చురుగ్గా కసరత్తు జరుగుతోందన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపులకు వీలుగా  సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపరచడంలో ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ పూర్థిస్థాయి దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్‌బీఐ పైలట్‌ ప్రాజెక్స్‌గా దీనిని ప్రారంభించిందని, అమలుకుగాను తొమ్మిది బ్యాంకులు - స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలను ఎంచుకుందని అన్నారు.

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ పేపర్‌ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువలతో జారీ అవుతుందన్నారు.  బ్యాంకుల వంటి ఫైనాన్షియల్‌ మీడియేటర్ల ద్వారా పంపిణీ జరుగుతుందని అన్నారు. భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్‌ వాలెట్‌ ద్వారా వినియోగదారులు ఈ–రూపాయితో లావాదేవీలు చేయగలుగుతారని కూడా వెల్లడించారు. ‘‘విదేశీ చెల్లింపులలో డిజిటల్‌ కరెన్సీ సహాయపడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము.  ఇది మరింత పారదర్శకత, లభ్యత సౌలభ్యతలను సమకూర్చుతుంది’’ అని హిందూ కళాశాల 125 సంవత్సరాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సీతారామన్‌ అన్నారు. ఇది తక్కువ ఖర్చుతో చెల్లింపులను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే చెల్లింపుల విషయాల్లో వ్యయాలను తగ్గిస్తుందని వివరించారు.

తయారీ, వ్యవసాయంపై దృష్టి..
భారతదేశాన్ని ‘వికసిత భారత్‌’గా మార్చడానికి ప్రాధాన్యతా రంగాల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ,  తయారీ వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘‘వ్యవసాయం దాని ప్రాధాన్యతను పటిష్టం చేసుకుంది. కొన్ని విధానాలు, ఆధునికీకరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని  బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తున్నాము’’ అని మంత్రి అన్నారు. తయారీలో, పునరుత్పాదక శక్తి, సెమీ  కండక్టర్, మెషిన్‌ లెర్నింగ్, ఎర్త్‌ సైన్సెస్, స్పేస్‌తో సహా 13 పురోగతి బాటలో ఉన్న రంగాలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె చెప్పారు.

సామాజిక పథకాల అమల్లో పురోగతి
పేదలకు కనీస అవసరాలు అందించడానికి రూపొందించిన సామాజిక రంగ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయికి చేరుకుంటోందని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.  భారతదేశం ఆర్థికంగా ’ఆత్మనిర్భర్‌’ (స్వయం సమృద్ధి) సాధించే సమయం ఆసన్నమైందని అన్నారు.  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఈ శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని వివరించారు. ఎటువంటి పురోగతి లేకుండా స్వాతంత్య్ర భారత్‌ 60 సంవత్సరాలు గడిపిందన్న ఆమె,  ‘‘మేము వికసిత భారత్‌కు భౌతిక పునాదిని వేశాము. అందరికీ ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశాము’’ అన్ని అన్నారు.

డీబీటీతో పారదర్శకత
బోగస్,  అవాంఛనీయ లబ్ధిదారులను తొలగించడం ద్వారా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ప్రభుత్వం రూ. 2.5  లక్షల కోట్లను ఆదా చేయగలిగిందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. డీబీటీ ద్వారా ప్రభుత్వ నిధుల బదిలీలో పారదర్శకతను మెరుగుపరచడమే కాకుండా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని ఆమె అన్నారు. ప్రజలకు సామాజిక కార్యక్రమాలను అందించడంలో ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని భారతదేశాన్ని యువత, మహిళలు, రైతులు పేదలు అనే నాలుగు గ్రూపులుగా వర్గీకరించడారని, మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఈ సమూహాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు మినహా వ్యవసాయానికి సంబంధించినంతవరకు భారతదేశం దాదాపు స్వయం సమృద్ధి సాధించిందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆహారాన్ని వృథా చేయవద్దని ఆమె ఈ సందర్భంగా సూచించారు.

రామ్‌ లల్లా ప్రాణ్‌ ప్రతిష్టతో నాగరికత విలువల పునరుద్ధరణ
జనవరి 22న రామ్‌ లల్లా ప్రాణ్‌ ప్రతిష్ట వేడుకను ’నాగరికత గుర్తు’గా నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. నాగరికత విలువల పునరుద్ధరణకు సాక్ష్యంగా నిలిచిన ప్రస్తుత తరానికి ఈ వేడుకలు అదృష్ట తరుణమని ఆమె అన్నారు.  నైపుణ్యాల అభివృద్ధితో పాటు నాగరికత– జాతీయత రెండింటికీ సంబంధించి విలువల పటిష్టతపై  దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులను కోరారు. దేశం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోందని విద్యార్థులకు గుర్తు చేస్తూ, ఓటు వేయడం పౌరుల హక్కు మాత్రమే కాదని,  అది వారి కర్తవ్యం కూడా అని అన్నారు. మొదటి సారి ఓటరుగా ఉన్న వారిపై ఎక్కువ బాధ్యత ఉందని ఆమె అన్నారు. సోషల్‌ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రతికూలతలను చూసి విద్యార్థులు తప్పుదారి పట్టవద్దని ఆమె కోరారు.

ఎకానమీపై తప్పుడు ప్రచారం
భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని  ఆర్థికమంత్రి పేర్కొంటూ, కంపెనీలు, స్టాక్‌ మార్కెట్‌ చాలా బాగా పని చేస్తున్నాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేదని, తీవ్ర ఒడిదుడుకులతో పయనిస్తోందన్న  కథనాలు అవాస్తమమని అన్నారు. అలాంటి ప్రచారం చేస్తున్న వారు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెబుతున్నారో చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. అయితే సమాధానం చెప్పడానికి వారు అందుబాటులో ఉండరని విమర్శించారు. తోచింది చెప్పిడం కొందరి పనిగా మారిందని అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు