సంపద సృష్టిలో అదానీ అదరహో

16 Jun, 2022 05:57 IST|Sakshi

వేగంగా వృద్ధి సాధించిన అదానీ

ఆరు నెలల్లో మార్కెట్‌ విలువ 88 శాతం పెరుగుదల

రూ.17.6 లక్షల కోట్లతో రెండో స్థానం

రిలయన్స్‌ వృద్ధి 13.4 శాతమే

రూ.18.87 లక్షల కోట్లతో తొలి స్థానం

ముంబై: అదానీ గ్రూపు తన విలువను అత్యంత వేగంగా పెంచుకుంది. 2020 ఏప్రిల్‌ వరకు ఆరు నెలల కాలంలో (2021 నవంబర్‌–2022 ఏప్రిల్‌) అదానీ గ్రూపు విలువ 88 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. ‘బర్గుండీ ప్రైవేట్‌ హరూన్‌ ఇండియా 500’ జాబితా బుధవారం విడుదలైంది. రూ.18.87 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంటే ఈ జాబితాలో ముందున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ అదే కాలంలో 13.4 శాతమే పెరిగింది. మొదటి స్థానంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఉండగా, రూ.12.97 లక్షల కోట్లతో టీసీఎస్‌ మూడో స్థానంలో ఉంది.  2022 ఏప్రిల్‌ వరకు ఆరు నెలల్లో టీసీఎస్‌ విలువ 0.9% తగ్గినా కానీ, మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ ఉన్నాయి.

► అదానీ గ్రూపు కంపెనీల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ విలువ ఆరు నెలల్లో 139 శాతం పెరిగి 2022 ఏప్రిల్‌ నాటికి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. గ్రూపు కంపెనీల్లో అత్యంత వేగంగా ఎక్కువ విలువను పెంచుకున్న కంపెనీ ఇది. దీంతో జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆరు నెలల క్రితం నాటి జాబితాలో ఇది 16వ స్థానంలో ఉండడం గమనార్హం
► అదానీ విల్‌మార్‌ ఇదే కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.66,427 కోట్లకు ఎగసింది. అదానీ పవర్‌ 158 శాతం పెరిగి రూ.66,185 కోట్లకు చేరింది.  
► అదానీ గ్రూపులో తొమ్మిది కంపెనీల విలువ ఉమ్మడిగా 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. టాప్‌–500 కంపెనీల మొత్తం విలువలో అదానీ గ్రూపు కంపెనీల విలువ 7.6 శాతంగా ఉంది.
► 2020 ఏప్రిల్‌ నాటికి 6 నెలల్లో భారత్‌లోని టాప్‌–500 కంపెనీల మార్కెట్‌ విలువ సగటున కేవలం 2% పెరగ్గా.. అదానీ గ్రూపు కంపెనీల విలువ 88% పెరగడం విశేషం.
► 2021 అక్టోబర్‌ 30 నాటికి భారత్‌లో టాప్‌–500 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.231 లక్షల కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్‌ నాటికి రూ.232 లక్షల కోట్లకు చేరింది.
► వీటి మార్కెట్‌ విలువ కొద్దిగానే పెరిగినా.. బీఎస్‌ఈ 30 షేర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 4 శాతం క్షీణించగా, నాస్‌డాక్‌ ఏకంగా 17% పతనాన్ని ఎదుర్కొన్నది.
► మార్కెట్‌ విలువలో క్షీణత చూసినవీ ఉన్నాయి. రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ విలువ ఇదే కాలంలో 17.9 శాతం పడిపోయి రూ.23,000 కోట్లుగా ఉంది.

అన్‌లిస్టెడ్‌ కంపెనీలు..
► అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో ఎన్‌ఎస్‌ఈ మార్కెట్‌ విలువ 2022 ఏప్రిల్‌ వరకు ఆరు నెలల్లో 35.6 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది.  
► సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విలువ 4.6 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరగా, బైజూస్‌ విలువ 24.7 శాతం వృద్ధి చెంది రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది.
► శాతం వారీగా చూస్తే వేదంత్‌ ఫ్యాషన్స్‌ విలువ 320 శాతం పెరగ్గా, అదానీ విల్‌మార్, బిల్‌ డెస్క్‌ 173 శాతం మేర (విడిగా) వృద్ధి చెందాయి.

మరిన్ని వార్తలు