అంబుజా, ఏసీసీకి ఓపెన్‌ ఆఫర్లు

17 May, 2022 06:18 IST|Sakshi

పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటాకు ఆఫర్‌

కొనుగోలుకి అదానీ గ్రూప్‌ సన్నాహాలు

అంబుజా సిమెంట్స్‌కు షేరుకి రూ. 385

ఏసీసీ షేరుకి రూ. 2,300 చొప్పున ధర

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా రెండు లిస్టెడ్‌ సిమెంట్‌ కంపెనీలకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ రెండు సంస్థలలో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న నేపథ్యంలో సెబీ నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్‌ వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 385 ధర ప్రకటించగా.. ఏసీసీకి రూ. 2,300 ధరతో ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది.  దేశీ సిమెంట్‌ దిగ్గజాలలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్‌ ఇండియాతో సుమారు రూ. 81,300 కోట్ల(10.5 బిలియన్‌ డాలర్లు) విలువైన(ఓపెన్‌ ఆఫర్‌తో కలిపి) ఒప్పందాన్ని అదానీ గ్రూప్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

మారిషస్‌ సంస్థ ద్వారా
మారిషస్‌ అనుబంధ(ఆఫ్‌షోర్‌) సంస్థ ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా అదానీ గ్రూప్‌ అంబుజా, ఏసీసీ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 51.63 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఇదే విధంగా ఏసీసీ వాటాదారుల నుంచి 26 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకోనుంది. ఇందుకు మరో రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. కాగా.. అంబుజా, ఏసీసీలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్‌ ఇండియాతో నికరంగా అదానీ గ్రూప్‌ రూ. 50,181 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ప్రస్తుతం అంబుజా, ఏసీసీ వార్షికంగా 70 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
సోమవారం ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్‌ షేరు  2.3% బలపడి రూ. 367.4 వద్ద నిలవగా.. ఏసీసీ  4% జంప్‌చేసి రూ. 2,193 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు