పది దేశాలకు మరింతగా ఎగుమతులు

12 Oct, 2023 06:04 IST|Sakshi

112 బిలియన్‌ డాలర్ల మేర పెంచుకునే అవకాశం

ప్రభుత్వ దన్ను, మార్కెటింగ్‌ వ్యూహాలతో సాధ్యమే

ఎఫ్‌ఐఈవో నివేదిక

న్యూఢిల్లీ: ప్రభుత్వ తోడ్పాటు, పటిష్టమైన మార్కెటింగ్‌ వ్యూహాలతో పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకు 112 బిలియన్‌ డాలర్ల మేర పెంచుకోవచ్చని వివరించింది. సదరు దేశాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో దేశీ సంస్థలు పాల్గొనేందుకు, విక్రేతలు–కొనుగోలుదారుల సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించడంలో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఒక స్కీమును రూపొందించవచ్చని ఎఫ్‌ఐఈవో తెలిపింది.

అలాగే, విదేశాల్లోని దిగుమతి సంస్థలు, దేశీ ఎగుమతి సంస్థల మధ్య సమావేశాలు నిర్వహించడంలో ఆయా దేశాల్లోని భారతీయ మిషన్లు పరిశ్రమకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొంది. తయారీ రంగంలో భారత్‌ సామర్థ్యాలను సదరు దేశాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చని ఎఫ్‌ఐఈవో వివరించింది.

‘112 బిలియన్‌ డాలర్ల మేర మరింతగా ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న 10 దేశాల్లో అమెరికా (31 బిలియన్‌ డాలర్లు), చైనా (22 బిలియన్‌ డాలర్లు), యూఏఈ (11 బిలియన్‌ డాలర్లు), హాంకాంగ్‌ (8.5 బిలియన్‌ డాలర్లు), జర్మనీ (7.4 బిలియన్‌ డాలర్లు), వియత్నాం (9.3 బిలియన్‌ డాలర్లు), బంగ్లాదేశ్‌ (5 బిలియన్‌ డాలర్లు), బ్రిటన్‌ (5.4 బిలియన్‌ డాలర్లు), ఇండొనేషియా (6 బిలియన్‌ డాలర్లు), మలేషియా (5.8 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి‘ అని ఎఫ్‌ఐఈవో తెలిపింది. 2030 నాటికి ఉత్పత్తులు, సేవల ఎగుమతులను 2 ట్రిలియన్‌ (లక్షల కోట్ల) డాలర్లకు పెంచుకోవాలని భారత్‌ నిర్దేశించుకుంది. 2022–23లో ఇవి 776 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

నివేదికలోని మరిన్ని వివరాలు..
► నివేదిక ప్రకారం పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలో వజ్రాలు, వాహనాలు, ఆభరణాలు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, మెరైన్‌ ఉత్పత్తులు, దుస్తులు, క్రిమిసంహాకరాలు, ఇనుము .. ఉక్కు, టీ, కాఫీ మొదలైనవి ఉన్నాయి.  
► అమెరికాకు డైమండ్లు (3.7 బిలియన్‌ డాలర్లు), మోటర్‌ వాహనాలు (2.2 బిలియన్‌ డాలర్లు), ఆభరణాలు (1.4 బిలియన్‌ డాలర్లు), టెలిఫోన్‌ సెట్లు, ఇతరత్రా వాయిస్‌/ఇమేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాలు (1.3 బిలియన్‌ డాలర్లు) మొదలైన వాటి ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం ఉంది.  
► చైనాకు మోటర్‌ వాహనాలు, ఆటో విడిభాగాలు, ఆభరణాలు, పశుమాంసం, రొయ్యలు, మిరియాలు, గ్రానైట్, ఆముదం, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవచ్చు.
► జర్మనీకి అల్యూమినియం, కాఫీ, దుస్తులు, జీడిపప్పు, మోటర్‌ వాహనాలు, ఆభరణాలు ఎగుమతి చేయొచ్చు.
► బ్రిటన్‌కు వజ్రాలు, ఆభరణాలు, రొయ్యలు, కలప ఫరి్నచరు, బియ్యం, బ్లాక్‌ టీ, టర్బోజెట్లు, ఆటో విడిభాగాలు, శాండ్‌స్టోన్, పిల్లల దుస్తుల ఎగుమతులను పెంచుకోవచ్చు.
► ఇండొనేషియా, మలేíÙయాకు ఇనుము..ఉక్కు ఐటమ్‌లు, ఆటో విడిభాగాలు, క్రిమిసంహారకాలు, అల్యూమినియం మిశ్రమ లోహాలు, రాగి క్యాథోడ్‌లు, రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులను మరింతగా ఎగుమతి చేయొచ్చు.
► ఎగుమతులు పెరగడం వల్ల దేశీయంగా ఉద్యోగాల కల్పనకు, తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ మారకాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది.

మరిన్ని వార్తలు