భారత్‌లో విమానాల సర్వీసింగ్‌.. హాల్‌తో ఎయిర్‌బస్‌ జట్టు!

9 Nov, 2023 20:07 IST|Sakshi

యూరోపియన్‌ మల్టీనేషనల్‌ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్‌లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్‌ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. 

దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్‌ఓ సేవల డిమాండ్‌ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. 

హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్‌ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్‌ నాసిక్‌ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్‌ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. 

భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్‌ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్‌ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు.

ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్‌ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్‌ వరల్డ్‌’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్‌లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్‌ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ నాసిక్ విభాగంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు