పర్సనల్‌ జెట్‌ప్యాక్‌లు వచ్చేస్తున్నాయి..

8 Nov, 2023 14:50 IST|Sakshi

ప్రస్తుతం కారు ఉండటం అనేది చాలా సాధరణం అయిపోయింది. అదే కారు లాగే ‘పర్సనల్‌ ఫ్లైట్‌’ ఉంటే... అమ్మో అది రూ. కోట్లతో కూడుకున్న వ్యవహారం. అంబానీ వంటి అపర కుబేరులకే అది సాధ్యమవుతుంది కానీ ఇతరులకెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? 

పర్సనల్‌ వాహన రంగంలో సరికొత్త శకం రాబోతోంది. కారు కొన్నంత సులువుగా, కారు ధరకే ‘పర్సనల్‌ ఫ్లైట్‌’లు కొనుక్కునే కాలం ఎంతో దూరంలో లేదు.  ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ కాదు. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టేసింది ఓ విదేశీ ఏవియేషన్‌ స్టార్టప్‌ కంపెనీ. 

కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్‌సన్‌ అనే కంపెనీ జెట్‌సన్‌ వన్‌ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ లాండింగ్‌ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. అంటే ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. ఇందు కోసం ప్రముఖ సెలబ్రిటీ ఆర్టిస్ట్‌, టెక్‌ విజనరీ విలియమ్‌ నుంచి 15 మిలియన్‌ డాలర్ల నిధులను సైతం పొందింది.


కారు కంటే వేగంగా..
జెట్‌సన్‌ వన్‌ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. ఇది ఆకాశ ఫార్ములా వన్ రేసింగ్ కారు. అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌తో దీన్ని తయారు చేశారు. ఇందులో ఎనిమిది శక్తివంతమైన మోటర్లు ఉంటాయి. ఇవి సమాన మొత్తంలో ప్రొపెల్లర్లను నడుపుతాయి. చూడటానికి డ్రోన్‌లాగా ఉండే ఈ వాహనాలను ఇటీవల అమెరికాలో పరీక్షించారు. అక్కడ వీటిని నడపడానికి పైలట్‌ లైసెన్స్‌ కూడా అక్కర్లేదు. 

ఆర్డర్ల స్వీకరణ
జెట్‌సన్‌ వన్‌ పర్సనల్‌ జెట్‌ప్యాక్‌లకు ఈ కంపెనీ ఆర్డర్లు స్వీకరిస్తోంది. వీటి కోసం ఇప్పటికే 300 మంది ఆర్డర్‌ చేశారు. ఇందు కోసం ఒక్కొక్కదానికి 98,000 డాలర్లు (సుమారు రూ.81.5 లక్షలు) చెల్లించారు. అంటే ఒక ప్రీమియం కారు ధర కంటే తక్కువే. 

మరిన్ని వార్తలు