ఐఏఎఫ్‌లోకి సీ–295 విమానం

26 Sep, 2023 06:21 IST|Sakshi
సీ–295 రవాణా విమానానికి పూజలు చేస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

ఘజియాబాద్‌: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది. ఈ విమానాలు ఐఏఎఫ్‌ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్‌ సర్వ ధర్మపూజ నిర్వహించారు. వైమానిక దళ చీఫ్‌ వీఆర్‌ చౌధరితోపాటు సీనియర్‌ అధికారులు, విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

వడోదర ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి పనిచేసే స్క్వాడ్రన్‌ నంబర్‌ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్‌ చీఫ్‌ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు. ఒప్పందంలో భాగంగా 16 విమానాల్ని ఎయిర్‌బస్‌ సంస్థ అందజేస్తుంది. మిగతా 40 విమానాల్ని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో కలిసి భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది. వి డి భాగాల తయారీ పనులు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
 

మరిన్ని వార్తలు