గ్లోబల్‌ క్రిప్టో మార్కెట్‌: ఒమిక్రాన్‌తోనూ లాభాలు.. కానీ, భారత పరిణామాలతో ఢమాల్‌

4 Dec, 2021 15:11 IST|Sakshi

క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్‌ నడుమ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తు ఆందోళనల నడుమ గ్లోబల్‌ క్రిప్టో మార్కెట్‌లో కరెన్సీలు దారుణమైన పతనాన్ని చవిచూస్తున్నాయి. 


ఒమిక్రాన్‌ వేరియెంట్‌ భయాందోళన నేపథ్యంలో గ్లోబల్‌ స్టాక్‌ మార్కెటన్నీ దారుణంగా కుదేలు అయిన వేళ.. క్రిప్టో మార్కెట్‌ మాత్రం లాభాల బాట నడిచింది. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు మార్కెట్‌ పతనం దిశగా కొనసాగుతోంది. అందుకు కారణం.. క్రిప్టో కరెన్సీ మీద భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనే బెంగ. అవును.. క్రిప్టో కరెన్సీపై ప్రత్యేక చట్టం తేవాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఊపందుకున్న వేళ..  అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ భారీ పతనం చవిచూస్తోంది. 


ఈ ఏడాది నవంబర్‌ 10న 69వేల డాలర్ల హై వాల్యూతో ఆల్‌టైం హైలో బిట్‌కాయిన్‌ నిలిచిన విషయం తెలిసిందే.  అలాంటి కరెన్సీ ఇప్పుడు ఏకంగా 31 శాతం పతనం చవిచూసింది. శనివారం మధ్యాహ్నానికి ఏకంగా 12.50 శాతం పతనంతో ట్రేడ్‌ అవుతోంది. ఇక ఎథెరియం దాదాపు 10 శాతం, కార్డానో 14 శాతం పతనంతో కొనసాగుతున్నాయి. టెథెర్‌ కొంచెం మెరుగైన ఫలితం (3.94 లాభం)తో, యూఎస్‌డీ కాయిన్‌ 3.91 శాతం పెరుగుదలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

 బిగ్గెస్ట్‌ గెయినర్‌: కోక్స్‌స్వాప్‌(COX)  

►  బిగ్గెస్ట్‌ లాసర్‌: జెమ్‌(DGM) గరిష్టంగా పతనం అయ్యింది


ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అస్సెట్‌’గా మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి.  పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోందని, మనీ లాండరింగ్‌ను అరికట్టడానికి ఈ బిల్లులో ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌’(పీఎమ్‌ఎల్‌ఏ) నిబంధనలను సైతం పొందుపరచనున్నారని ఆ కథనాలు ఉటంకిస్తున్నాయి. ఇక ‘ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుందని, డిజిటల్‌ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 


మరోవైపు గ్లోబల్‌ క్రిప్టో మార్కెట్‌లో మీమ్‌ కాయిన్స్‌ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే కొనసాగుతోంది. డోజ్‌కాయిన్‌, షిబా ఇను, డోజ్‌లన్‌ మార్స్‌, సామోయెడ్‌కాయిన్‌లు కూడా పతనం దిశగానే కొనసాగుతున్నాయని కాయిన్‌మార్కెట్‌ క్యాప్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది. 

► డోజ్‌కాయిన్‌ 4.53 శాతం పతనం అయ్యింది
► షిబా ఇను 4.22 శాతం పతనం అయ్యింది

మొత్తంగా ఈ ఉదయానికి క్రిప్టో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(2.43 ట్రిలియన్‌ డాలర్లు విలువ) 6.16 శాతం పతనం చవిచూసింది. అయితే  గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 20 శాతం క్రిప్టో మార్కెట్‌ వాల్యూమ్‌ పెరిగి.. 137 బిలియన్‌ డాలర్లపైకి చేరుకుంది.

చదవండి: చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్‌.. వందల కోట్లు హాంఫట్‌!

మరిన్ని వార్తలు