అమెజాన్‌ డైలీ క్విజ్‌; అదృష్టం హాయ్‌ చెబితే..

17 Feb, 2021 19:07 IST|Sakshi

అమెజాన్‌లోకి వెళితే...
విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న బేతాళుడి గొంతు నుంచి ‘ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయావో’ లాంటి గట్టి వార్నింగ్‌ వినిపించదు. తల వెయ్యివక్కలు అయ్యే ప్రసక్తే లేదు. కానీ... కనిపించే ప్రశ్నలకు కచ్చితంగా కచ్చితమైన సమాధానం చెప్పాలనే గట్టి పట్టుదల మాత్రం పెరుగుతుంది. వెయ్యిదారులు వెదికి అయినా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపిస్తుంది. పదండీ... ఒకసారి అమెజాన్‌ డైలీ క్విజ్‌లోకి వెళ్లొద్దాం...

అడిగేవారికి చెప్పేవారు లోకువ కాదు ఇప్పుడు.. చెప్పాలంటే లోకజ్ఞానులు, బహుమతి అందుకునే విజేతలు. బాలీవుడ్‌ నుంచి సీఫుడ్‌ వరకు, జానీవాకర్‌ నుంచి జాన్‌అబ్రహం వరకు.. రకరకాల ప్రశ్నలకు జవాబులు చెబితే సమాధానం చెప్పిన సంతృప్తి మాత్రమే కాదు అదృష్టం హాయ్‌ చెబితే మంచి మంచి బహుమతులు కూడా ఆన్‌లైన్‌ క్విజ్‌లలో సొంతం చేసుకోవచ్చు. కాస్త సరదా కోసమో, ప్రచార వ్యూహంలో భాగంగానో అమెరికన్‌ ఇ–కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ‘డైలీ క్విజ్‌’ ప్రారంభించింది. ఇది ఎంత క్లిక్‌ అయిందంటే రకరకాల సైట్లతో పాటు కొన్ని పత్రికలు కూడా ‘అమెజాన్‌ క్విజ్‌ ఆన్సర్లు ఇవే’ అంటూ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నాయి.

ఎలా వెళ్లాలి?

స్టెప్‌ 1 గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి అమెజాన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

స్టెప్‌ 2 హోమ్‌పేజీలోకి వచ్చిన తరువాత: అమెజాన్‌ యాప్‌–ఆఫర్స్‌–క్లిక్‌ ఆన్‌ అమెజాన్‌ క్విజ్‌ 8ఎయం టు 12 పీఎం.    

స్టెప్‌ 3 అమెజాన్‌ క్విజ్‌ బ్యానర్‌లో ‘స్టార్ట్‌’ బటన్‌ నొక్కడంతో క్విజ్‌ మొదలవుతుంది.

స్టెప్‌ 4 ఇక్కడ కనిపించే అయిదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానం ఇస్తే ‘అమెజాన్‌ క్విజ్‌ విన్నర్స్‌ లక్కీ డ్రా’కు ఎంపిక అవుతారు.

స్టెప్‌ 5 ప్రకటన తేదీలో విజేతల జాబితా ఇవ్వబడుతుంది.

ఐఫోన్, సోనీ పోర్టబుల్‌ పార్టీ సిస్టం, ఫాజిల్‌ స్మార్ట్‌వాచ్, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌... కొన్నిసార్లు ఇలా ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. గత నెలల విజేతల పేర్ల జాబితా కూడా చూడవచ్చు. ‘అమెజాన్‌ క్విజ్‌లో మీరు ఎందుకు గెలవలేకపోయారు?’లాంటి వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఎక్కుగానే కనిపిస్తాయి. అయితే మొదట్లో గిఫ్ట్‌  కోసమే అమెజాన్‌ క్విజ్‌లోకి ప్రవేశించినా ఆ తరువాత మాత్రం అదొక ముఖ్య విషయం కాని పరిస్థితి వస్తుంది. డైలీ పజిల్‌ సాల్వ్‌ చేయడంలాగే ఇదొక దినచర్యగా మారుతుంది చాలామందికి.

అమెజాన్‌ మాత్రమే కాదు ఇండియన్‌ ఇ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్‌ ‘క్విజ్‌’ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. మరోవైపు క్విజ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్యూఎఫ్‌ఐ)లాంటి సంస్థలు కాలానికి తగ్గట్టు జూమ్, డిస్‌కార్డ్‌ (ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ అండ్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫామ్‌)లలో క్విజ్‌ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి.

‘మనకేం తెలుస్తుందిలే...అనుకొని ఒకప్పుడు క్విజ్‌ అనే మాట వినబడగానే దూరంగా జరిగేవారు. కాని ఆన్‌లైన్‌ స్పేస్‌లో మాత్రం దీనికి అనూహ్యమైన ఆదరణ ఉంది. లైవ్‌ క్విజ్‌లలో జవాబు ఇవ్వడానికి  ఏ ఆధారం ఉండదు. ఆన్‌లైన్‌లో మాత్రం గూగుల్‌లాంటి వాటిపై ఆధారపడే వెసులుబాటు ఉంటుంది’ అంటున్నారు క్యూఎఫ్‌ఐ సెక్రెటరీ జయకాంతన్‌.
సరే, ఏదో ఒకటి. మొత్తానికైతే దూరంగా ఉండే వాళ్లు సైతం క్విజ్‌ కాంటెస్ట్‌ల వైపు ఆకర్షితులు కావడం శుభసూచన.

ఆన్‌లైన్‌ క్విజ్‌తో ప్రయోజనాలు
1 మైండ్‌ ఫిట్‌గా ఉంటుంది            
2 ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఆలోచిస్తాం.
3 టైమ్‌మెనేజ్‌మెంట్‌ తెలుస్తుంది  
4 జ్ఞాపకశక్తికి ఎక్సర్‌సైజ్‌లా ఉపకరిస్తుంది.
5 క్వశ్చన్‌ బ్యాంకు తయారుచేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది. 

చదవండి:
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్! 

టిక్‌టాక్ తో ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు

మరిన్ని వార్తలు