ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్‌ డెలివరీ స్టేషన్‌, ఎక్కడంటే..

20 Nov, 2021 10:44 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పూర్తిగా మహిళల నిర్వహణలో డెలివరీ కేంద్రాల సంఖ్యను పెంచుతోంది. 5వ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇటువంటి డెలివరీ పార్ట్‌నర్‌ స్టేషన్స్‌ చెన్నై, గుజరాత్, కేరళలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 750కిపైగా నగరాలు, పట్టణాల్లో మొత్తం 1,650 డెలివరీ సర్వీస్‌ పార్ట్‌నర్‌ స్టేషన్స్‌ ఉన్నాయి.  

నాలుగు ప్రభుత్వ సంస్థలతో  అమెజాన్‌ భాగస్వామ్యం 
మరోవైపు మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించే దిశగా అమెజాన్‌ సహేలీ ప్రోగ్రాం కింద నాలుగు సంస్థలతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా తెలిపింది. జార్ఖండ్‌ స్టేట్‌ లైవ్‌లీహుడ్‌ ప్రమోషన్‌ సొసైటీ (జెఎస్‌ఎల్‌పీఎస్‌), ఉత్తర్‌ప్రదేశ్‌ స్టేట్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ (యూపీఎస్‌ఆర్‌ఎల్‌ఎం), ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (సీజీ ఫారెస్ట్‌) అస్సామ్‌ రూరల్‌ ఇన్‌ఫ్రా అండ్‌ అగ్రి సర్వీసెస్‌ (ఏఆర్‌ఐఏఎస్‌) వీటిలో ఉన్నాయి.

ఆయా రాష్ట్రాల్లో సదరు సంస్థల పరిధిలోని మహిళా వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలను అమెజాన్‌ ఇండియాలో నమోదు చేసుకునేందుకు, మరింత విస్తృతంగా మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయని అమెజాన్‌ తెలిపింది. ఉత్పత్తుల లిస్టింగ్, ప్యాకేజింగ్, షిప్పింగ్‌ తదితర అంశాలకు సంబంధించి మహిళలు అమెజాన్‌ సహేలీ ప్రోగ్రాం కింద శిక్షణ కల్పిస్తామని పేర్కొంది. ఉమెన్స్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డే సందర్భంగా మహిళా వ్యాపారవేత్తలు రూపొందించిన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టోర్‌ ఆవిష్కరించినట్లు అమెజాన్‌ వివరించింది.

చదవండి: అమెజాన్‌, 10 లక్షల మంది ఏ రేంజ్‌ ఫోన్లు కొన్నారో తెలుసా..!

మరిన్ని వార్తలు