షాపింగ్‌ వైపే భారతీయుల చూపు

16 Nov, 2023 07:58 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ వేదికలు విస్తరించినప్పటికీ రిటైల్‌ స్టోర్లకు వెళ్లడం భారతీయులకు అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్‌ విధానంగా నిలిచింది. ఇన్‌–స్టోర్‌ షాపింగ్‌ జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఉత్పత్తిని ముట్టుకోవడం, అనుభూతి చెందగల అవకాశం ఉండడమే. ఉత్పత్తుల ఖచ్చితమైన ప్రామాణికత, నాణ్యత కారణంగా ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ను దాదాపు 54 శాతం మంది ఇష్టపడుతున్నారని డిజిటల్‌ రుణ సంస్థ నౌగ్రోత్‌ సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25కుపైగా నగరాల్లో సుమారు 3,000 మంది వర్తకులు, కొనుగోలుదార్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు.  

కుటుంబంతో షాపింగ్‌.. 
హోమ్‌ డెలివరీని వినియోగదార్లు కోరుకుంటున్నారు. ఇంటికి సరుకులు పంపాల్సిందిగా కస్టమర్లు డిమాండ్‌ చేస్తున్నారని 60 శాతం విక్రేతలు తెలిపారు. దాదాపు సగం మంది తమ స్థానిక స్టోర్లకు విధేయులుగా ఉన్నారు. ఒక కుటుంబంలోని అనేక తరాలు తరచుగా ఒకే రిటైలర్‌ నుండి షాపింగ్‌ చేయడం వల్ల విశ్వాసం, పరిచయానికి దారి తీస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి స్థానిక రిటైలర్‌ నుండి 35 శాతం మంది భారతీయులు షాపింగ్‌ చేస్తున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది కస్టమర్లు రిటైల్‌ స్టోర్‌లో కుటుంబ షాపింగ్‌ అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో స్టోర్లకు వినియోగదార్లు అధికంగా వస్తున్నారు.  

ఫ్లాష్‌ సేల్స్‌ సమయంలో.. 
భారతీయ కొనుగోలుదార్లలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ విక్రయ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా షాపింగ్‌ చేస్తున్నారు. 26 ఏళ్లలోపు ఉన్న జెన్‌–జీ కస్టమర్లలో 14 శాతం మంది పూర్తిగా ఆన్‌లైన్‌ను ఎంచుకుంటున్నారు. 43–58 మధ్య వయసున్న జెన్‌–ఎక్స్‌ వినియోగదార్లలో కేవలం 5 శాతం, 27–42 మధ్య వయసున్న మిల్లేనియల్స్‌లో 11 శాతం మంది ఆన్‌లైన్‌ వేదికగా షాపింగ్‌ చేస్తున్నారు. ఫ్లాష్‌ సేల్స్, ఈ–కామర్స్‌ కంపెనీల ద్వారా అధిక తగ్గింపులను అందించే సమయాల్లో ఆన్‌లైన్‌లో ఎక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి. ఫ్లాష్‌ సేల్స్‌ సమయంలో మాత్రమే ఆన్‌లైన్‌ షాపింగ్‌ను 35 శాతం మంది ఇష్టపడుతున్నారు.

ఈ–కామర్స్‌తో ముప్పు లేదు.. 
తమ కార్యకలాపాలకు ఈ–కామర్స్‌తో ఎటువంటి ముప్పు లేదని 80 శాతంపైగా వర్తకులు ధీమా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ విక్రయ వేదికలు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని 18 శాతం మంది వెల్లడించారు. భారత్‌లో ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ అమ్మకాల్లో ఆఫ్‌లైన్‌ వాటా ఏకంగా 97 శాతం ఉంది. ఫుడ్, బెవరేజ్‌ విభాగంలో 95 శాతం, కంజ్యూమర్‌ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్‌ విక్రయాల్లో ఆఫ్‌లైన్‌ 93 శాతం కైవసం చేసుకుంది. దాదాపు 60 శాతం మంది రిటైలర్లు భవిష్యత్తులో డిజిటల్‌ టూల్స్‌ సహాయంతో రిటైల్‌ స్టోర్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. 70 శాతం మంది రిటైలర్లు తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ఔట్‌లెట్లను తెరవాలని యోచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు