అపోలో హాస్పిటల్స్‌ చేతికి ‘కోల్‌కతా’ ఆస్పత్రి

28 Sep, 2023 07:04 IST|Sakshi

రూ. 102 కోట్లకు పాక్షికంగా నిర్మించిన అసెట్‌ కొనుగోలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ తూర్పు రాష్ట్రాల్లో మరింతగా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో పాక్షికంగా నిర్మించిన ఓ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ ఆంకాలజీ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి తమ అనుబంధ సంస్థ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌ రూ. 102 కోట్లకు ఈ హాస్పిటల్‌ను కొనుగోలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. 

కోల్‌కతా ప్రాంతంలో అపోలో హాస్పిటల్‌కు ఇది రెండో ఆస్పత్రి కాగా, తూర్పు ప్రాంతంలో అయిదోది. దీనితో కోల్‌కతా, భువనేశ్వర్, గువాహటివ్యాప్తంగా 1,800 పైచిలుకు పడకలతో అతిపెద్ద హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌గా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలమని తెలిపింది. తూర్పు రాష్ట్రాల్లో వచ్చే 3 ఏళ్ల వ్యవధిలో పడకల సంఖ్యను మరో 700 మేరకు పెంచుకోనున్నామని, తద్వారా సదరు ప్రాంతంలో మొత్తం పడకల సంఖ్య 2,500కి చేరగలదని వివరించింది. 

తాజాగా కొనుగోలు చేసిన సోనార్‌పూర్‌లో ఆస్పత్రిని 325 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద 1.75 లక్షల చ. అ. విస్తీర్ణంలోని 225 పడకలు వచ్చే 12 నెలల్లో అందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అపోలో హాస్పిటల్స్‌ను రెండు దశాబ్దాలపైగా కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు