భారత్‌లో ఐఫోన్‌–12 అసెంబ్లింగ్‌

12 Mar, 2021 04:38 IST|Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌–12 స్మార్ట్‌ఫోన్‌ అసెంబ్లింగ్‌ను భారత్‌లో మొదలుపెట్టింది. స్థానిక కస్టమర్ల కోసం వీటిని దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. ఈ మోడల్‌ను థర్డ్‌ పార్టీ అయిన ఫాక్స్‌కాన్‌ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌–10ఆర్, ఐఫోన్‌–11 మోడళ్లను ఫాక్స్‌కాన్, విస్ట్రన్‌ కంపెనీలు అసెంబుల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 2017లో తొలుత ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌తో భారత్‌లో ఫోన్ల తయారీకి యాపిల్‌ శ్రీకారం చుట్టింది. భారతదేశాన్ని మొబైల్, విడిభాగాల తయారీకి పెద్ద కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని అన్నారు.  

జోరుమీదున్న అమ్మకాలు..
ఆన్‌లైన్‌ స్టోర్‌ మెరుగైన పనితీరుతో డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెండింతలైందని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ జనవరిలో వెల్లడించారు. కంపెనీ తన ఉనికిని పెంచుకోవడానికి దేశంలో రిటైల్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్టోర్లు నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. కౌంటర్‌పాయింట్‌ నివేదిక ప్రకారం 2020 అక్టోబర్‌–డిసెంబరులో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో దేశంలో ఆరవ స్థానంలో ఉన్న యాపిల్‌ అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 171 శాతం వృద్ధి సాధించింది. 2019తో పోలిస్తే గత సంవత్సరం 93 శాతం అధికంగా సేల్స్‌ నమోదు చేసింది. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ 15 లక్షల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. సంస్థ ఈ స్థాయి అమ్మకాలు ఒక త్రైమాసికంలో సాధించడం ఇదే తొలిసారి. గతేడాది యాపిల్‌ టర్నోవర్‌ 29 శాతం పెరిగి రూ.13,756 కోట్లు నమోదు చేసింది. నికరలాభం రూ.926 కోట్లుగా ఉంది. 

మరిన్ని వార్తలు