కొత్త పెట్టుబడులు కష్టమే..

5 Sep, 2020 04:33 IST|Sakshi

సమస్యల్లో ఆటోమొబైల్‌ రంగం

ప్రభుత్వ మద్దతు అవసరం

సియామ్‌ వార్షిక సదస్సులో ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోందని, కొత్తగా అమల్లోకి రాబోయే నిబంధనలకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా వ్యాఖ్యానించారు. భారత్‌ అమలు చేస్తున్న ఉద్గార ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటికి సరిసమాన స్థాయిలోనే ఉంటున్నాయని.. నిబంధనల డోసేజీని అతిగా పెంచేయరాదని సియామ్‌ 60వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నుంచి అమల్లోకి వచ్చే కార్పొరేట్‌ సగటు ఇంధన సామర్థ్యం (సీఏఎఫ్‌ఈ) మొదలైన నిబంధనలకు అనుగుణంగా తయారీ చేసేందుకు కావాల్సిన పెట్టుబడులు పెట్టే స్తోమత పరిశ్రమకు లేదని పేర్కొన్నారు.  

ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి..
ఆటోమోటివ్‌ మిషన్‌ ప్లాన్‌ 2026 (ఏఎంపీ)లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని వధేరా చెప్పారు.  ఆటోమోటివ్, ఆటో పరికరాల పరిశ్రమ 2026 నాటికి ఏ స్థాయిలో ఉండాలి, దేశ ఆర్థిక వృద్ధిలో ఏ స్థాయిలో తమ వంతు పాత్ర పోషించాలి తదితర అంశాలపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి రూపొందించుకున్న ప్రణాళిక ఏఎంపీ 2026. దీని ప్రకారం ప్రస్తుతం  జీడీపీ 7%గా ఉన్న ఆటో పరిశ్రమ వాటాను 12%కి పెంచుకోవాలని, ఇప్పటికే ఉన్న 3.7 కోట్ల ఉద్యోగాలకు అదనంగా 6.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని నిర్దేశించుకున్నారు. అలాగే, 2026 నాటికి వాహన ఉత్పత్తిని 6.6 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

జీఎస్‌టీ రేట్ల కోత సంకేతాలు: సియామ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వాహనాలపై జీఎస్‌టీ రేటును తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా  భారీ పరిశ్రమల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సంకేత మిచ్చారు. ఆటోమోటివ్‌ పరిశ్రమ త్వరలోనే ’శుభ వార్త’ వింటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. మరోవైపు ఆటోమొబైల్‌ పరిశ్రమకు కావల్సిన పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి నితిని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఫ్లెక్స్‌–ఫ్యూయల్‌ ఇంజిన్లను భారత్‌లో తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కాగా, భారత ఆటో పరిశ్రమ చరిత్రలోనే అత్యంత కష్టకాలం ఎదుర్కొంటోందని మారుతీ  ఎండీ కెనిచి అయుకవ పేర్నొన్నారు. జీఎస్‌టీని తగ్గించడం, ప్రోత్సాహకాల ఆధారిత స్క్రాపేజీ విధానం తదితర మార్గాల్లో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.

సియామ్‌ కొత్త అధ్యక్షుడిగా మారుతీ సీఈఓ
మారుతీ సుజుకీ కంపెనీ సీఈవో కెనిచి ఆయుకవ సియామ్‌ కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈయన 2 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అలాగే వైస్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీవోఓ విపిన్‌ సోంధి ఎన్నికయ్యారని, ట్రెజరర్‌గా ఐషర్‌ మోటర్‌ ఎండీ వినోద్‌ అగర్వాల్‌ కొనసాగుతారని సియామ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు