గచ్చిబౌలి... మూడేళ్లలో 33 శాతం పైకి!

24 Nov, 2023 07:35 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతం ముందుంది. ఇక్కడ గడిచిన మూడేళ్లలో ఇళ్ల ధరలు 33 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ ఇళ్ల ధరలు ఇదే కాలంలో 13–33 శాతం మధ్య పెరగడం గమనార్హం. ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ వెల్లడించింది.

గచ్చిబౌలిలో 2023 అక్టోబర్‌ నాటికి ఇళ్ల ధర చదరపు అడుగుకు (సగటున) రూ.6,355కు చేరింది. 2020 అక్టోబర్‌ నాటికి ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,790గా ఉండేది. ఇక కొండాపూర్‌లోనూ చదరపు అడుగుకు ధర 31 శాతం పెరిగి, రూ.4,650 నుంచి రూ.6,090కు చేరింది. సౌకర్యవంతమైన, విశాలమైన ఇళ్లను ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ మార్కెట్‌ వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి.  

🏘️బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ఇళ్ల ధరలు 29 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,325కు చేరాయి.  

🏘️ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో ఇళ్ల ధరలు సగటున చదరపు అడుగుకు 13–27 శాతం మధ్య గత మూడేళ్లలో పెరిగాయి.  

🏘️ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గ్రేటర్‌ నోయిడా వెస్ట్‌లో మాత్రం 27 శాతం ధరలు ఎగిశాయి. ఎంఎంఆర్‌లో లోయర్‌ పరేల్‌లో 21 శాతం మేర 
పెరిగాయి.  

🏘️బెంగళూరులోని తానిసంద్ర మెయిన్‌రోడ్‌లో 27 శాతం, సార్జాపూర్‌ రోడ్‌లో 26 శాతం చొప్పున ధరలకు రెక్కలొచ్చాయి.  

🏘️పుణెలో ఐటీ కంపెనీలకు కేంద్రాలైన వాఘోలిలో 25 శాతం, హింజేవాడిలో 22 శాత, వాకాడ్‌లో 19 శాతం చొప్పున ధరలు పెరిగాయి.

🏘️ముంబైలోని లోయర్‌ పరేల్, అంధేరి, వర్లి టాప్‌–3 మైక్రో మార్కెట్లుగా ఉన్నాయి. ఇక్కడ ధరలు 21 శాతం, 19 శాతం, 13 శాతం చొప్పున అధికమయ్యాయి.  

బలమైన డిమాండ్‌.. 
‘‘బలమైన డిమాండ్‌కు తోడు, నిర్మాణంలో వినియోగించే మెటీరియల్స్‌ ధరలు ఎగియడం వల్ల దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో సూక్ష్మ మార్కెట్లలో ఇళ్ల ధరలు పెరిగాయి’’అని అనరాక్‌ రీసెర్చ్‌ హెడ్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. ముడి సరుకుల ధలు, నిర్మాణ వ్యయాలు పెరగడం, భూముల ధరలు పెరుగుదల, డిమాండ్‌ అధికం కావడం వంటివి ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు సిగ్నేచర్‌ గ్లోబల్‌ (ఇండియా) సహ వ్యవస్థాపకుడు, ఎండీ రవి అగర్వాల్‌ పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు