ప్రలోభాల పర్వం! | Sakshi
Sakshi News home page

ప్రలోభాల పర్వం!

Published Fri, Nov 24 2023 7:38 AM

- - Sakshi

● ఓటర్లను ఆకర్షించేందుకు తుది వ్యూహాలు సిద్ధం ● ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు ● రసవత్తరంగా మారిన జిల్లా రాజకీయం ● పట్టు కోసం ప్రధాన పక్షాల తీవ్ర ప్రయత్నాలు

సాక్షి, ఆసిఫాబాద్‌: విమర్శలు, ప్రతి విమర్శలు, సభలు, సమావేశాలు, ప్రచారాలతో ఊరూవాడా హోరెత్తిపోతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలు షురూ అయ్యాయి. ఎన్నికల ముందు ఎక్కడైనా కనిపించే రాజకీయ వాతావరణమిది. ప్రస్తుతం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు మరో వారం రోజులే గడువు ఉండటంతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా రాజకీయ సంభాషణలే. ఏ నోట విన్నా త్వరలో జరిగే ఎన్నికలపై చర్చలే.. ‘ఏం చేద్దాం.. ఎలా గెలుద్దాం..’ ప్రస్తుతం ఏ నాయకుడిని కదిపినా ఇవే మాటలు... ఉమ్మడి ఆదిలాబాద్‌లో సంస్కృతి, భాష, ఇతర వ్యవహారాల్లో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రత్యేకమైంది. ఇక్కడ పట్టు కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడిక్కింది. జిల్లాలోని లీడర్లు గెలుపును ప్రతిష్టాత్మకంగా భావించడంతో ప్రజలు కూడా రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

ప్రచార హోరు..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక నాలుగు రోజులే ఉంది. 30న పోలింగ్‌ ఉండగా, 28వ తేదీనే ప్రచారం ముగుస్తుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఊరూ.. వాడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గంపగుత్తగా ఓటర్ల అవసరాలను తీరుస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల్లో బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. వారు అడిగినంతా డబ్బు చెల్లించి ప్రచారంలో పాల్గొనకుండా చేస్తున్నారు. సామాన్యుడి అస్త్రమైన ఓటును చేజిక్కించుకోవడానికి.. ఓటరును మాయ చేయడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, ఎన్నికల నిఘా బృందాలు కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

తుది వ్యూహాలు సిద్ధం

ఎన్నికల ప్రచారంలో అన్ని రకాలుగా ఓటర్ల కరుణ పొందేందుకు ప్రయత్నించిన అభ్యర్థులు తుది వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, మద్యం, మాంసం, గృహోపకరణ వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 4.53 లక్షల ఓటర్లున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు తమ నమ్మినబంట్ల ద్వారా డబ్బుతోపాటు మద్యం కూడా విచ్చలవిడిగా పంపిణీ చేయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని అవసరమైతే ఓటర్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద రూ. 30–50 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో చివరి క్షణంలో టికెట్‌ తెచ్చుకున్న ఓ పార్టీకి చెందిన అభ్యర్థి విపరీతంగా ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం ప్రచారానికి వచ్చిన వ్యక్తులకు రూ.200లతోపాటు ఓ మద్యం బాటిల్‌ను అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా సాయంత్రం ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు. చివరి క్షణం వరకు వేచి ఉంటే పోలీసుల ఒత్తిడి ఉంటుందన్న యోచనతో ఆయన గురువారం నుంచే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఓటుకు రూ.500 చొప్పున తన అనుయాయులతో పంపిణీ చేయించినట్లు సమాచారం. మద్యం సరఫరాలో అడ్డంకి ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ మద్యం వ్యాపారులకు ముందుగానే డబ్బులు చెల్లించి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. కాగా ప్రత్యర్థి పంపిణీ చేసే సొమ్మును బట్టి మరో విడత పంపిణీకి సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గంలో మరో అభ్యర్థి సైతం మద్యం, డబ్బు పంపిణీ విచ్చలవిడిగా చేస్తున్నట్లు సమాచారం. సిర్పూర్‌ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ తరఫున బరిలో నిలిచిన సీనియర్‌ నేత ఒకరు గెలుపు కోసం తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఆయన సమీప అభ్యర్థులు దూసుకుపోతుండడంతో వారిని దెబ్బకొట్టడానికి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారం ముమ్మరంగా సాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement