బజాజ్‌ ఆటో లాభం 16% డౌన్‌

15 Oct, 2022 00:56 IST|Sakshi

క్యూ2లో రూ. 1,719 కోట్లు

న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం బజాజ్‌ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 2,040 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం తగ్గింది. విదేశాలకు ఎగుమతులు 25 శాతం క్షీణించడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 8,762 కోట్ల నుంచి రూ. 10,203 కోట్లకు చేరింది.

స్టాండెలోన్‌ ప్రాతిపదికన మాత్రం లాభం రూ. 1,275 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 11,44,407 యూనిట్ల నుంచి నామమాత్రంగా 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5,32,216 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధి చెంది 6,94,375 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 6,12,191 యూనిట్ల నుంచి 4,56,637 యూనిట్లకు తగ్గాయి. విదేశీ మార్కెట్లలో స్థూలఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు ఇందుకు కారణమని బజాజ్‌ ఆటో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం విక్రయాలు పుంజుకున్నాయని వివరించింది.  

శుక్రవారం బీఎస్‌ఈలో బజాజ్‌ ఆటో షేర్లు 1%  క్షీణించి రూ. 3,569 వద్ద క్లోజయ్యాయి.  

మరిన్ని వార్తలు