వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..మొబైల్‌ నుంచే ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయోచ్చు!

18 Jul, 2022 07:55 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్‌ ఇండియా (బీవోఐ), పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) సంయుక్తంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. కే–ఫిన్‌టెక్‌ సాయంతో నూతన ఎన్‌పీఎస్‌ చందాదారుల చేరిక కోసం దీన్ని తీసుకొచ్చాయి. బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవో ఏకే దాస్‌ సమక్షంలో పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ సుప్రతిమ్‌ బందోపాధ్యాయ దీన్ని ప్రారంభించారు. దీంతో మొబైల్‌ ఫోన్‌ నుంచే ఎన్‌పీఎస్‌ ఖాతా (స్వచ్ఛంద పింఛను ఖాతా) తెరవొచ్చు.

 ఎటువంటి పేపర్లు అవసరం లేకుండా, మొబైల్‌ ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవొచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ, బీవోఐ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఎంతో సులభంగా, వేగంగా కేవలం కొన్ని క్లిక్‌లతో ఖాతా ప్రారంభించొచ్చని ప్రకటించాయి. 

ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. అది వెబ్‌ పేజీకి తీసుకెళుతుంది. అక్కడి డిజిటల్‌ దరఖాస్తును వివరాలతో పూర్తి చేయాలి. ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలి. దీంతో డిజీలాకర్‌ సాయంతో ఫొటో, ఇతర వివరాలను ప్లాట్‌ఫామ్‌ తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తుంది.

మరిన్ని వార్తలు