నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!!

16 Feb, 2021 00:01 IST|Sakshi

జాబితాలో బీవోఐ, ఐవోబీ, సెంట్రల్‌ బ్యాంక్‌...  

2021–22లో రెండింటిలో వాటాల విక్రయం 

ముందుగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ప్రైవేటీకరణకు అవకాశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం నాలుగు మధ్య స్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్లు సమాచారం. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌తో మొదలయ్యే 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేటీకరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

సంఖ్యాపరంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో సిబ్బంది ఒక మోస్తరుగానే ఉన్నందున ముందుగా ఆ బ్యాంకుతోనే ప్రైవేటీకరణ ప్రారంభం కావచ్చన్న అంచనా లు ఉన్నాయి. అలాగే ఐవోబీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో దానిపై విధించిన ఆంక్షలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఎత్తివేయొచ్చని, దీంతో అందులోనూ వాటాల విక్రయం సజావుగా జరగవచ్చని ఆశిస్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియ వాస్తవంగా ప్రారంభం కావడానికి 5–6 నెలలు పట్టేయొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఉద్యోగుల సంఖ్య, ట్రేడ్‌ యూనియన్ల ఒత్తిళ్లు, రాజకీయపరమైన పరిణామాలు మొదలైనవి తుది నిర్ణ యంపై ప్రభావం చూపవచ్చని వివరించాయి. దీనివల్ల ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయం ఆఖ రు నిమిషంలో కూడా మారవచ్చని  ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఒకేసారి నాలుగింటినీ అనుకున్నా..
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు బ్యాంకులనూ ప్రైవేటీకరించాలని సర్కారు ముందుగా భావించినప్పటికీ ఉద్యోగుల యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు హెచ్చరించడంతో ప్రణాళికలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ విడతలో మధ్య స్థాయి, చిన్న స్థాయి బ్యాంకులనే ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. రాబోయే రోజుల్లో పెద్ద బ్యాంకులపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల వారికి రుణ లభ్యత పెంచడం తదితర లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో మాత్రం మెజారిటీ వాటాలను కొనసాగించవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  

పెద్ద బ్యాంకులను పరిశీలించాలి: ఎన్‌పీఏలతో కుదేలవుతున్న  బలహీన, చిన్న బ్యాంకులను తీసుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. పైగా వీటిని విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక వనరులు కూడా భారీగా సమకూరే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ లేదా బీఓబీ వంటి పెద్ద బ్యాంకులను ప్రైవేటీకరించే అంశాన్ని పరిశీలించాలంటున్నారు. 

ప్రక్షాళనకు చర్యలు..
బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే సింహ భాగం వాటా ఉంటోంది. అలాగే మొండిబాకీల (ఎన్‌పీఏ) విషయంలోనూ వీటిపై గణనీయంగా భారం పడుతోంది.   కరోనా వైరస్‌ పరిణామాల కారణంగా కొన్ని పద్దులను మొండిబాకీలుగా వర్గీకరించడంపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నప్పటికీ .. ఇవి తొలగిన మరుక్షణం ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోయే ముప్పు ఉందన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొండిబాకీలు పేరుకుపోయి కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

కానీ పీఎస్‌బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. ఎకాయెకిన పీఎస్‌బీలను భారీ యెత్తున ప్రైవేటీకరిస్తే ఇటు ఉద్యోగులపరంగా అటు  రాజకీయంగా రిస్కీ వ్యవహారం అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రక్రియనైతే మొదలుపెట్టాలని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు