దశాబ్ద కనిష్టానికి మొండి బాకీలు

6 Apr, 2023 04:46 IST|Sakshi

2023–24లో 3.8 శాతానిక తగ్గొచ్చని అంచనా

క్రిసిల్‌ వెల్లడి

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏ) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 3.8 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చివరిసారిగా 2014 మార్చి త్రైమాసికంలో ఈ స్థాయి ఎన్‌పీఏలు నమోదయ్యాయి. ఈమధ్యే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 5.9 శాతం నుంచి 4.2 శాతానికి దిగి వచ్చి ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఈ విషయాలు వెల్లడించింది.

అధిక విలువ గల కార్పొరేట్‌ రుణ పద్దులకు సంబంధించిన ఎన్‌పీఏల పరిస్థితి మెరుగుపడుతున్నట్లు తెలిపింది. ఈ విభాగంలో స్థూల ఎన్‌పీఏలు 2 శాతం దిగువకు తగ్గవచ్చని పేర్కొంది. కార్పొరేట్లు తమ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రీ–పేమెంట్‌ సహా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రిస్కు నిర్వహణ, అండర్‌రైటింగ్‌ను పటిష్టం చేసుకోవడం తదితర అంశాలు కూడా బ్యాంకులు.. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తోడ్పడుతున్నాయి.

రిటైల్‌ విభాగంలో తనఖా లేని రుణాల మంజూరు పెరుగుతున్నప్పటికీ.. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో వాటి వాటా చాలా తక్కువే ఉంటుందని క్రిసిల్‌ డిప్యుటీ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ చెప్పారు. బ్యాంకింగ్‌ రంగం మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాలు 26 శాతంగా ఉంటాయని.. వీటిలో సగం గృహ రుణాలు, నాలుగో వంతు వాటా వాహన రుణాలది ఉంటుందని తెలిపారు. అన్‌సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాలు మొదలైన అన్నింటి వాటా రిటైల్‌ పోర్ట్‌ఫోలియోలో నాలుగో వంతుగా ఉంటుందన్నారు.  

నెమ్మదించనున్న వడ్డీ మార్జిన్లు..
వడ్డీ రేట్ల పెంపుదలతో గత ఆర్థిక సంవత్సరం ఆసాంతం పెరుగుతూ వచ్చిన నికర వడ్డీ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో నెమ్మదించవచ్చని సీతారామన్‌ తెలిపారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ సంక్షోభ పరిస్థితులు ఎలా ఉన్నా దేశీ బ్యాంకింగ్‌ రంగం ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొనగలదని పేర్కొన్నారు.

భారత్‌లో వడ్డీ రేట్ల పెంపు తక్కువ స్థాయిలో ఉండటం, రికార్డు కనిష్ట స్థాయికి తగ్గుతున్న మొండి బాకీలతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం తదితర అంశాలు ఇందు కు దోహదపడగలవని సీతారామన్‌ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారీ రుణ వృద్ధి 15 శాతం స్థాయిలో కొనసాగవచ్చని పేర్కొన్నారు. అసెట్‌ క్వాలిటీపై ఆందోళన తగ్గుతున్న నేపథ్యంలో నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) పెరగవచ్చని తెలిపారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల ఏయూఎం 13–14 శాతం పెరగవచ్చని సీతారామన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు