బ్యాంకింగ్‌లో పాలనా ప్రమాణాలు పెరగాలి

3 Nov, 2021 04:22 IST|Sakshi

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ జైన్‌  

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో పాలనా ప్రమణాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ పేర్కొన్నారు. ఒక ఆంగ్లపత్రిక నిర్వహించన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాలనా ప్రమాణాల పెంపువల్ల ప్రజల్లో బ్యాంకింగ్‌ పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అనేది ఏదైనా సంస్థకు మూలస్తంభం వంటిదన్నారు.

ఇది బ్యాంకులకు భిన్నమైన గుర్తింపును, ప్రాముఖ్యతను ఇస్తుందని అన్నారు. బ్యాంకింగ్‌ సేవల పరంగా ప్రత్యేక సేవా లక్షణాలను కలిగివుందన్నారు.  దీనితోపాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉత్ప్రేరకాలుగా బ్యాంకులు పనిచేస్తాయని అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. ఇటువంటి ప్రత్యేక లక్షణాల వల్లే ఎటువంటి హామీ లేకుండానే భారీ ఎత్తున డిపాజిట్లను బ్యాంకులు సమీకరించగలుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల్లో పాలనా సంస్కరణలు కీలకంగా ఉన్నాయన్నారు.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ విస్తరణ నేపథ్యంలో సైబర్‌ భద్రత అనేది కీలక పర్యవేక్షక అంశంగా మారిందన్నారు. ఈ విషయంలో ఆందోళనలను పరిష్కరించడానికి, వివిధ ప్రమాద సూచికలను ఉపయోగించి బ్యాంకులలో సైబర్‌ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఆర్‌బీఐ ఒక నమూనా ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసిందని తెలిపారు.  ‘‘ఒక ఆర్థిక సంస్థ కార్యకలాపాలు, దాని పాలనా ప్రమాణాలు, వ్యాపార నమూనా, ఇబ్బందులను ఎదుర్కొనే సామర్థ్యం, ఈ విషయంలో ఇచ్చే హామీ వంటి అంశాలు... దీర్ఘకాలంలో ఆ సంస్థ ఎంత బాగా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది‘ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు