ప్రియమైన వారికి అమూల్య బహుమతి

2 Nov, 2020 05:04 IST|Sakshi

జీవిత బీమా పాలసీతో కుటుంబానికి రక్షణ

ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడొచ్చు

బహుమతిగా ఇచ్చే ముందు చూడాల్సిన అంశాలు..

అన్నింటికంటే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ చౌక

తక్కువ ప్రీమియంకే ఎక్కువ ప్రయోజనాలు

ముఖ్యమైన పండుగలు, పుట్టిన రోజు.. ఈ తరహా ప్రత్యేక సందర్భాల్లో కొందరు అపురూప కానుకల ద్వారా తమకు అత్యంత సన్నిహితులను సంతోషానికి, ఆశ్చర్యానికి గురి చేయాలనుకుంటారు. ఇందుకోసం ఖరీదైన కార్లు, బంగారం, వజ్రాభరణాలు, ఫ్లాట్‌ లేదా విల్లా ఈ తరహా కానుకలను ఇచ్చే వారు ఉన్నారు. కానీ, ఈ తరహా భౌతిక కానుకలు కాకుండా, మీరు నిజంగా అభిమానించే వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు వినూత్నంగా బీమా పాలసీని బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదు..? ఆలోచించండి. ఒక వ్యక్తి అకాల మరణంతో సంబంధిత కుటుంబం ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ సమయంలో బీమా పాలసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందనడంలో సందేహం లేదు. కనుక జీవిత బీమా పాలసీని ఇవ్వడం నిజంగా అపురూపమైన కానుకే అవుతుంది.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ అయితే మరణానికి పరిహారం ఇచ్చే ఉద్దేశ్యంతో కూడినది. పాలసీ కాల వ్యవధి ముగిసిపోయే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ, పాలసీ కాల వ్యవధి సమయంలో అకాల మరణానికి గురైతే నామినీకి సమ్‌ అష్యూరెన్స్‌ను పరిహారం కింద చెల్లించడం జరుగుతుంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో రూ.కోటి సమ్‌ అష్యూరెన్స్‌ (బీమా రక్షణ మొత్తం)కు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది.

వీటిని గమనించాలి..
బీమా పాలసీని కానుకగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇతర ఉత్పత్తుల వైపు ఆలోచన వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే, బండిల్డ్‌ ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించాలి. బీమా రక్షణకు, పెట్టుబడి ఇతర ఆప్షన్లను జోడించి ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాలను కంపెనీలు చేస్తుంటాయి. కానీ, వీటిల్లో ఉండే అనేక రకాల చార్జీలతో బీమా కంపెనీలకే ప్రయోజనం ఎక్కువ. ఈ చార్జీల కారణంగా  పాలసీదారులకు చివర్లో దక్కేది తక్కువే. సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలు గట్టిగా 4–5 శాతం మించి రాబడులను ఇవ్వలేవు. ఇక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్‌ లింక్డ్‌ బీమా పథకాల్లో (యులిప్‌) రిస్క్‌ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులకు హామీ ఉండదు. అధిక రిస్క్‌ తీసుకునే వారికి యులిప్‌ పాలసీలు పెట్టుబడి ఆప్షన్‌ అవుతాయి. కానీ, టర్మ్‌ పాలసీలతో పోలిస్తే అసలైన బీమా ప్రయోజనం వీటిల్లో తక్కువే. ఇక పాలసీ ఎంపిక విషయంలో బీమా కంపెనీ, బీమా మొత్తం, బీమా కాల వ్యవధి, ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి వీటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి.

బీమా ఎంత?
ఎంత మొత్తం బీమా తీసుకోవాలనే విషయంలో ఓ సాధారణ సూత్రం ఉంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకుంటే, పది రెట్ల మేర రూ.60 లక్షలకు బీమా కవరేజీని తీసుకోవడం అవసరం. అయితే, సంబంధిత వ్యక్తి పేరిట ఉన్న అప్పులు, కుటుంబ జీవన శైలి ఆధారంగా ఈ మొత్తం మారిపోతుంది. ఏమైనా రుణ భారం ఉంటే ఆ మేరకు అదనంగా బీమా కవరేజీ అవసరం. ఇక పాలసీ కాల వ్యవధిని నిర్ణయించే ముందు ఎంత కాలం పాటు ఇంకా ఆ వ్యక్తి పనిచేయగలరన్నది కీలకం అవుతుంది. ఎందుకంటే కుటుంబానికి సంబంధిత వ్యక్తి ఆర్జన అవసరమైనంత కాలం మేర బీమా రక్షణ ఉంటే సరిపోతుంది.

ప్రీమియంలపై ప్రత్యేక దృష్టి...
బీమా కంపెనీలు 80 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణను ఆఫర్‌ చేస్తున్నాయి. ఆలస్యంగా వివాహం అవడం, ఆలస్యంగా సంతానం కలిగిన వారికి రిటైరైన తర్వాత కూడా కొంత కాలం వరకు బీమా రక్షణ అవసరంపడొచ్చు.  బీమా ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి కూడా కీలకమైనదే. బీమా కంపెనీలు పరిమిత కాలం పాటు చెల్లింపు, పూర్తి కాలం పాటు చెల్లింపు ఆప్షన్లు ఇస్తుంటాయి. పరిమిత కాలం ఆప్షన్‌లో 20 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 5/10/15 ఏళ్ల పాటు చెల్లించే అవకాశం ఇవ్వొచ్చు. ఇటువంటి సందర్భాల్లో చెల్లించే ప్రీమియం మొత్తం అధికంగా ఉంటుంది.

కొనుగోలు ఏ రూపంలో..?
ఆన్‌లైన్‌లో అయితే బీమా పాలసీని తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. దీనితో ఏజెంట్ల కమీషన్‌ భారం ఉండదు. అన్ని బీమా కంపెనీలు తమ అధికారిక వెబ్‌ పోర్టళ్ల ద్వారా ఆన్‌లైన్‌ పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఒకటికి మించిన బీమా కంపెనీల మధ్య ప్రీమియం పరంగా అంతరం, ప్రయోజనాల వైరుధ్యం తెలుసుకుని మంచి పాలసీని ఎంచుకునేందుకు పాలసీబజార్‌ డాట్‌ కామ్‌ పోర్టళ్లు అనుకూలంగా ఉంటాయి. పేరు, వయసు, ఎంత కాలానికి బీమా కవరేజీ కావాలి, ఎంత మొత్తం అనే వివరాలను పోర్టళ్లలో ఇవ్వడం ద్వారా ప్రీమియం ఎంతన్న కొటేషన్‌ చూసుకోవచ్చు.

నచ్చితే అక్కడి నుంచే తదుపరి, పాన్, ఇతర ఆరోగ్య వివరాలు, చిరునామా, కాంటాక్ట్‌ సమాచారం ఇవ్వడం ద్వారా అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేసుకోవచ్చు. దీనికి 10–15 నిమిషాలకు మించి పట్టదు. చివర్లో ప్రీమియం చెల్లించినట్టయితే, కంపెనీ సిబ్బంది మీకు కాల్‌ చేసి తదుపరి వివరాలు కోరతారు. కొన్ని కంపెనీలు ఆరోగ్య పరీక్షల అనంతరం బీమా పాలసీని జారీ చేస్తాయి. కొనుగోలుకు ముందు ముఖ్యంగా బీమా కంపెనీని ఎంచుకునే ముందు, క్లెయిమ్స్‌ హిస్టరీని పరిశీలించాలి. అంటే ఒక్కో ఆర్థిక సంవత్సరంలో బీమా పరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఎన్నింటికి కంపెనీ పరిహారం చెల్లించింది, ఎన్నిటిని తిరస్కరించింది, అలాగే ఎన్ని అపరిష్కృతంగా ఉన్నాయనే వివరాలను ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చు. చెల్లింపుల హిస్టరీ మెరుగ్గా ఉన్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చిన క్లెయిమ్స్‌ పట్ల బీమా కంపెనీ ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలుస్తుంది.

ఈ విషయంలో జాగ్రత్త...
ఒకరి పేరిట బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడమే కాదు... సంబంధిత వ్యక్తి మరణిస్తే పరిహారం దక్కే విషయంలో తగిన రక్షణ కల్పించడం కూడా అవసరం. బీమా పాలసీ కలిగిన వారు మరణించిన సందర్భాల్లో, వారి పేరిట రుణాలు ఉంటే, ఆ పరిహారం తాము స్వాధీనం చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోర్టులను ఆశ్రయించొచ్చు. అదే జరిగితే వాటికి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇవ్వొచ్చు. ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేందుకు, జీవిత బీమా పాలసీని వివాహిత మహిళా ఆస్తి చట్టం (ఎండబ్ల్యూపీ) కింద రిజిస్టర్‌ చేయాలి. ఇలా చేసిన పాలసీ విషయంలో క్లెయిమ్‌ హక్కును సంబంధిత వ్యక్తి జీవిత భాగస్వామి లేదా పిల్లలు మాత్రమే కలిగి ఉంటారు. కనుక బీమా పాలసీ కొనుగోలు సమయంలోనే దానిని ఎండబ్ల్యూపీ చట్టం కింద తీసుకోవాలి. ఒక్కసారి పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి వీలు పడదు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు