Cyber Investment Fraud Scam: రూ. 854 కోట్ల భారీ సైబర్ స్కామ్‌.. వేలాది మంది బాధితులు

30 Sep, 2023 18:43 IST|Sakshi

పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి రూ.వందల కోట్లు కాజేసిన భారీ సైబర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌ వెలుగులోకి వచ్చింది. రూ. 854 కోట్ల సైబర్ ఫ్రాడ్‌ స్కామ్‌ను బెంగళూరు పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులను మోసం చేసిన ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు వారి నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా వల.. 
నిందితుల ముఠా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల ద్వారా బాధితులను ఆకర్షించింది. మొదట్లో  రోజుకు రూ.1,000 నుంచి 5,000 వరకు లాభం వస్తుందని నమ్మించి బాధితుల నుంచి రూ.1,000 నుంచి 10,000 వరకు చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టించుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఇలా వేలాది మంది బాధితులు రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని వివరించారు.

బాధితులు పెట్టుబడి పెట్టిన సొమ్మును కేటుగాళ్లు ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. అయితే, పెట్టుబడి ప్రక్రియ పూర్తయిన తర్వాత, బాధితులు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు, వారికి ఎలాంటి వాపసు రాలేదని అధికారి తెలిపారు. మొత్తం సేకరించిన తర్వాత, నిందితులు ఏకీకృత డబ్బును మ్యూల్ ఖాతాలకు (మనీలాండరింగ్‌కు సంబంధించిన) మళ్లించారని పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన మొత్తం రూ.854 కోట్లు క్రిప్టో (బినాన్స్), పేమెంట్ గేట్‌వే, గేమింగ్ యాప్‌ల ద్వారా వివిధ ఆన్‌లైన్ చెల్లింపు మోడ్‌లలోకి డంప్ చేశారని వివరించారు.

మరిన్ని వార్తలు