మార్చి నుంచి స్పెక్ట్రం వేలం

7 Jan, 2021 03:54 IST|Sakshi

బేస్‌ ధర రూ. 3.92 లక్షల కోట్లు

దరఖాస్తులకు ఫిబ్రవరి 5 ఆఖరు తేదీ

టెలికం శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు ఎదురుచూస్తున్న స్పెక్ట్రం వేలం నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మార్చి 1 నుంచి ఆరో విడత వేలం నిర్వహించనున్నట్లు టెలికం శాఖ ఒక నోటీసులో పేర్కొంది. జనవరి 12న ప్రీ–బిడ్డింగ్‌ సమావేశం నిర్వహించనుండగా, నోటీసులోని అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జనవరి 28 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5లోగా టెలికం ఆపరేటర్లు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24న బిడ్డర్ల తుది జాబితా ప్రకటిస్తారు. రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే 2,251.25 మెగాహెట్జ్‌ పరిమాణం స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేయనుంది. 700 మెగాహెట్జ్, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వీటిలో ఉంటాయి.

నాలుగేళ్ల విరామం తర్వాత..
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బేస్‌ ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రెండేళ్ల క్రితమే సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర క్యాబినెట్‌ గతేడాది డిసెంబర్‌ 17న ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నిర్వహించబోయే వేలంలో 5జీ సేవల కోసం ఉపయోగించే 3,300–3,600 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ను చేర్చలేదు. దేశవ్యాప్తంగా ప్రీమియం 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రం కోసం బిడ్డర్లు కనీసం రూ. 32,905 కోట్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుత  పరిస్థితుల నేపథ్యంలో స్పెక్ట్రం వేలానికి ఒక మోస్తరుగానే స్పందన ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  రూ.30,000–రూ.60,000 కోట్ల శ్రేణిలో బిడ్లు రావొచ్చని పేర్కొన్నాయి. 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో రూ.30,000 కోట్లకు మాత్రమే బిడ్లు పరిమితం కావొచ్చనేది జేఎం ఫైనాన్షియల్స్‌ అంచనా. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రూ. 55,000–రూ. 60,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చు.

నిబంధనలిలా..
మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 700 మెగాహెట్జ్‌ బ్యాండ్, 800, 2,300 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. మిగతా ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. ముందస్తుగా పూర్తి చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడే బిడ్డర్లు .. ఫలితాలు వెల్లడైన 10 రోజుల్లోగా కట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ విడతలవారీగా చెల్లించే విధానాన్ని ఎంచుకుంటే బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీని బట్టి బిడ్డింగ్‌ మొత్తంలో నిర్దేశిత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 1800, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్‌ బ్యాండ్లకు సంబంధించి 50 శాతం కట్టాలి. 700, 800, 900 మెగాహెట్జ్‌ బ్యాండ్ల కోసం 25 శాతం చెల్లించాలి. టెలికం శాఖ డిమాండ్‌ నోటీసు జారీ చేసిన పది రోజుల్లోగా చెల్లింపులు జరపాలి. బిడ్డింగ్‌ మొత్తంతో పాటు సవరించిన స్థూల ఆదాయంపై (వైర్‌లైన్‌ సేవలు మినహా) మూడు శాతాన్ని స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కట్టాల్సి ఉంటుంది.

కొన్ని సర్కిళ్లలో వొడాఫోన్‌ దూరం..
తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా .. కొన్ని సర్కిళ్లలో వేలం ప్రక్రియలో పాల్గొనపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రం వినియోగ హక్కులను పునరుద్ధరించుకోవడంపై టెలికం కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌కు సంబంధించి 900 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 12.4 మెగాహెట్జ్‌ పరిమాణం, 1800 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 47 మెగాహెట్జ్‌ పరిమాణం, ప్రస్తుతం 800 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో రిలయన్స్‌ జియో ఉపయోగించుకుంటున్న 44 మెగాహెట్జ్‌ స్పెక్ట్రం రెన్యువల్‌కు రానున్నాయి. వొడాఫోన్‌ ఐడియా 900, 1800 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో స్పెక్ట్రంను పునరుద్ధరించుకోవాల్సి ఉంది. ఈ రెన్యువల్స్‌ కోసం భారతీ ఎయిర్‌టెల్‌ సుమారు రూ. 15,000 కోట్లు, రిలయన్స్‌ జియో రూ. 11,500 కోట్లు వెచ్చించాల్సి రావొచ్చని క్రెడిట్‌ సూసీ అంచనా వేస్తోంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు