లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్

21 Feb, 2021 14:25 IST|Sakshi

కరోనా కారణంగా వ్యాపారాలు డీలా పడి, ఉద్యోగాలు పోయి ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దీనితో కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు భారీ ఉద్దీపన పథకాల ప్రకటిస్తున్నాయి. ఉద్దీపనల వల్ల కరెన్సీ విలువ పడిపోవడం వల్ల బ్యాంకింగ్‌ రంగం సుస్థిరతపై అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో బిట్‌కాయిన్ ధర మాత్రం రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. చాలా మంది పెట్టుబడి దారులు బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ బిట్‌కాయిన్ మార్కెట్ లో 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. 

ఈ కారణాల వల్ల బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా లక్ష కోట్లకు చేరుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక కాయిన్ ధర 56,620 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పెరిగింది. రెండు నెలలుగా బిట్‌కాయిన్ విలువ రోజురోజుకి పెరుగుతోంది. గత వారంలోనే 18శాతం లాభపడింది. అలాగే ఈ ఏడాదిలో 92శాతం పైకి చేరుకుంది. శనివారం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ట్రేడింగ్ విలువ లక్ష కోట్లు లేదా రూ.72.73 లక్షల కోట్లు దాటింది. 18.6 మిలియన్ డాలర్ల బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని 2009 జనవరిలో తీసుకువచ్చారు.

చదవండి:

బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!

మరిన్ని వార్తలు