కొత్త ఏడాది.. 18 లక్షల కొత్త వాహనాలు

8 Feb, 2023 09:58 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జనవరిలో అన్ని విభాగాల్లో కలిపి రిటైల్‌లో 18,26,669 వాహనాలు అమ్ముడయ్యాయి. 2022 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 14 శాతం అధికమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయాలు 22 శాతం అధికమై 3,40,220 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 10 శాతం ఎగసి 12,65,069 యూనిట్లుగా ఉంది. త్రీవీలర్లు 59 శాతం పెరిగి 65,796 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 16 శాతం వృద్ధి చెంది 82,428, ట్రాక్టర్లు 8 శాతం దూసుకెళ్లి 73,853 యూనిట్లకు చేరుకున్నాయి. 

2020 జనవరితో పోలిస్తే గత నెల విక్రయాలు 8 శాతం తక్కువ అని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. గ్రామీణ మార్కెట్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, యాజమాన్య ఖర్చు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. పునర్వినియోగపరచదగిన ఆదాయం అదే నిష్పత్తిలో పెరగలేదని చెప్పారు. పాత వాహనాల భర్తీ, సరకు రవాణా పెరుగుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నుంచి స్థిర మద్ధతు కారణంగా.. మార్కెట్‌లో డిమాండ్‌ కొనసాగి వాణిజ్య వాహనాల విభాగం కోవిడ్‌ ముందస్తు కంటే పెరగడానికి సహాయపడింది అని వివరించారు.

(ఇదీ చదవండి: సూపర్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!)

మరిన్ని వార్తలు