త్వరలోనే కొత్త హౌసింగ్‌ స్కీమ్‌.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి 

29 Sep, 2023 17:02 IST|Sakshi

గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. 

“మేము కొత్త హోమ్ సబ్‌వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం​ ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు.

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు.

‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు.

రాయిటర్స్ కథనం ప్రకారం..  ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్‌ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు.

మరిన్ని వార్తలు