విమానాశ్రయం విస్తరణే ధ్యేయం.. 300 ఎకరాలు కావాలి

18 Sep, 2022 15:04 IST|Sakshi

మీనంబాక్కం విమానాశ్రయం విస్తరణే ధ్యేయంగా మరిన్ని పనులు చేపట్టాలని విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 300 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం, స్వదేశీ, అంతర్జాతీయ టెర్మినల్స్‌గా సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తీర్చిదిద్దారు. ఇక్కడ విమానాల ట్రాఫిక్‌ పెరిగింది. దీంతో కాంచీపురం జిల్లా పరందూరులో మరో విమానాశ్రయానికి చర్యలు చేపట్టారు.

ఈ విమానశ్రయం ప్రారంభమయ్యేలోపు చెన్నైలో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికుల సంఖ్య పెంచడంపై విమానయాన శాఖ దృష్టి పెట్టింది. ఇందుకోసం మీనంబాక్కం విమానాశ్రయ పరిసరాలను మరింతగా విస్తరించబోతున్నారు. ఇందుకు తగ్గ నివేదిక సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం కార్గో ఉన్న పరిసరాలను విమాన సేవలకు ఎంపిక చేశారు. కార్గో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. కార్గోను మరో చోటకు మార్చేందుకు తగిన ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. విమానాశ్రయానికి అవతలి వైపు ఉన్న ఖాళీ స్థలాలపై సైతం అధికారులు దృష్టి పెట్టడం గమనార్హం. 300 ఎకరాల స్థలాన్ని మరింత విస్తరణ పనులకు స్వాధీనం చేసుకోబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

చదవండి: హమ్మయ్యా..ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ ఊరట!

 

మరిన్ని వార్తలు