దిగ్గజ ఎఫ్‌ఎమ్‌ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..

30 Oct, 2023 12:27 IST|Sakshi

ఎంటర్‌‌టైన్‌‌మెంట్ నెట్‌‌వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్‌‌ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్‌‌ఎమ్ రేడియో నెట్‌‌వర్క్‌‌ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్​ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్​ ఎఫ్​ఎమ్‌ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ​ఎఫ్ఎమ్‌ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సఫైర్ ఎఫ్‌ఎమ్‌​ కూడా బిగ్ ఎఫ్‌ఎమ్‌ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్‌‌ఎమ్ , సఫైర్ ఎఫ్‌‌ఎమ్‌ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్‌‌ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

బిగ్ ఎఫ్‌‌ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్‌‌వర్క్. 1,200 పట్టణాలకు,  50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్‌ఎఫ్‌ఎమ్‌ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు